జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించిన జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గురుపాదం
Nalgonda District Collector Ila Tripathi: ప్రజా దీవెన నాంపల్లి మే 21 మండల కేంద్ర పట్టణమైన నాంపల్లి లోని షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ ను 2025- 26 విద్యా సంవత్సరంలో పునః ప్రారంభించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలెంక గురుపాదం వినతి పత్రం అందజేశారు. సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చి బాలికల హాస్టల్ ను పునః ప్రారంభిస్తే 100 నుండి 150 మంది విద్యార్థినీలకు వసతి సౌకర్యం ఏర్పడి, వారు బాగా చదువుకునే అవకాశం ఏర్పడుతుందని కలెక్టర్ కు వివరించారు.
నాలుగు దశాబ్దాలకు పైగా నాంపల్లిలో బాలికల వసతి గృహం లో వసతి పొంది వేలాదిమంది విద్యార్థినీలు ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో స్థిరపడ్డారని, వివరించారు. గత ప్రభుత్వం హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ఒక్కో హాస్టల్ వెల్ఫేర్ అధికారికి నాలుగు నుండి ఐదు వసతి గృహాలకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ముఖ్యంగా మహిళ హెచ్ డబ్ల్యు ఓ లు పని భారం పెరిగి వసతి గృహాలలో ఉంటున్న పిల్లలను వారి ఇండ్లకు పంపించి పిల్లలు లేరనే కారణం చూపి వసతి గృహాలను తాత్కాలికంగా మూసివేశారని అన్నారు.
గత రెండు సంవత్సరాలుగా నాంపల్లి బాలికల వసతిగృహం లో ప్రవేశం పొంది విద్యాభ్యాసం చేయాలనుకుంటున్నప్పటికీ వసతిగృహం మూసివేసి ఉండడంతో బాలికలు వసతి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రస్తుత తెలంగాణ ప్రజా ప్రభుత్వం షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ఖాళీగా ఉన్న హెచ్ డబ్ల్యు ఓ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని, అందువల్ల నాంపల్లి బాలికల వసతి గృహాన్ని వెంటనే పునః ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కు గాలెంక గురుపాదం విజ్ఞప్తి చేశారు. నాంపల్లి వసతి గృహానికి పక్కా సొంత భవనం ఉందని, చిన్న చిన్న మరమ్మత్తులు పూర్తి చేసి జూన్ మాసంలో వసతి గృహంలో బాలికలు ప్రవేశం పొందడానికి దరఖాస్తులు స్వీకరించి హాస్టల్ ను ప్రారంభించడానికి సాంఘిక సంక్షేమ అధికారులను ఆదేశించాలని ఆయన కోరారు.
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చరవాణి ద్వారా వాట్సప్ లో వసతి గృహాన్ని తెరిపించాలని విజ్ఞప్తి చేయగా ఎమ్మెల్యే చొరవ తీసుకొని నివేదిక తెప్పించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. గతంలో కూడా జిల్లా కలెక్టర్ కు వసతి గృహ ప్రారంభోత్సవం కోసం వినతి పత్రం సమర్పించడం జరిగిందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చండూర్ ఆర్డీవో వందనపు శ్రీదేవి నాంపల్లి తహశీల్దార్ ను హాస్టల్ను సందర్శించి నివేదిక సమర్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు. నాంపల్లి తహశీల్దార్ గూగులోత్ దేవాసింగ్ వసతి గృహాన్ని సందర్శించి వసతి గృహాన్ని ప్రారంభించుటకు ఎలాంటి అభ్యంతరం లేదని, చిన్న చిన్న మరమ్మత్తులు పూర్తి చేసి హాస్టల్ ను పునః ప్రారంభిస్తే 150 మంది బాలికలకు నాంపల్లి మండలంలోని 32 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నివేదిక పంపారని గాలెంక గురుపాదం గుర్తు చేశారు. వినతి పత్రం సమర్పించిన సమయంలో అంబేద్కర్ యువ కేంద్రం జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు, టి యు డబ్ల్యూ జే – 143 మునుగోడు నియోజకవర్గ ఉపాధ్యక్షులు కామిశెట్టి యాదయ్య నాంపల్లి మండల శాఖ కోశాధికారి లింగస్వామి మర్రిగూడ మండల శాఖ ప్రధాన కార్యదర్శి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.