India

Southwest Monsoon 2026 : నైరుతి రుతుపవనాల జోరు.. తెలుగు రాష్ట్రాలకు వర్షాల శుభవార్త

నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రానున్న రోజుల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉంది.

Southwest Monsoon 2026: వేసవి వేడితో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఊరట కలిగించే సమాచారం అందించింది. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వేగంగా ముందుకు సాగుతుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ప్రస్తుతం బంగాళాఖాతంలోని పశ్చిమ-మధ్య, ఈశాన్య ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి. అలాగే ఈశాన్య భారత రాష్ట్రాల్లోనూ అవి మరింత చురుకుగా ముందుకు కదులుతున్నాయి. ఈ ప్రభావంతో మరో రెండు నుంచి మూడు రోజుల్లో తెలంగాణలోని మరిన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

తెలంగాణలో తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా రాష్ట్రం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

Southwest monsoon brings rain chances, thunderstorms and strong winds across Telangana and Andhra Pradesh

Also Read:Monsoon Enters Andhra Pradesh: ఏపీలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలకు అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నాయి. కోస్తా కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఈదురుగాలులు, మెరుపులు ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చేస్తున్నాయి. మరోవైపు వాతావరణంలో తేమ పెరగడంతో ఉక్కపోత కూడా అధికంగా ఉండే అవకాశముంది.

రాయలసీమ ప్రాంతంలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే ఐదు రోజులలో ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, ఎండల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు వేడి నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

Back to top button