Vote: ఓటు వజ్రాయుధం
రాష్ట్రవ్యాప్తంగా వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించే మానవ హక్కుల వేదిక బృందం ఓటు హక్కు వినియోగంపై ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పది
వరంగల్ జిల్లాల్లో ఊరూరా ప్రచారం
ప్రజాదీవెన, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించే మానవ హక్కుల వేదిక బృందం ఓటు హక్కు వినియోగంపై ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని వివరిస్తూ వరంగల్ జిల్లాలోని ఊరూరా ప్రచారం చేస్తోంది. తాయిళాలకు ఆకర్షితులు కాకుండా ఓటువేయాలని పాదయాత్ర ద్వారా కరపత్రాలు పంచుతూ వేదిక ప్రతినిధులు ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని, కోపంతోనే కసితోనే ఓటువేయొద్దని జయప్రకాశ్ నారాయణ అన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో సమర్థులైన నాయకుల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని మానవహక్కుల వేదిక ప్రతినిధులు సూచిస్తున్నారు. ఈ నెల 11న హనుమకొండలో పాదయాత్రను ప్రారంభించిన మానవ హక్కుల వేదిక బృందం పల్లెలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
భవిష్యత్‌కు బంగారు బాటలు వేద్దాం
రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో రకరకాల హామీలతో ప్రజల ముందుకు వస్తుంటాయి. వాటిని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు మా సంస్థ తరుఫున మేము కృషి చేస్తున్నాం. సరైన నాయకుడ్ని ఎన్నుకునేలా ఓటర్లను అవగాహన పరుస్తున్నాం. మేము కరపత్రాలను పంపిణీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని మానవ హక్కుల (Human rights) వేదిక రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ అన్నారు.
ఓటు ప్రాధాన్యం వివరించేలా ముద్రించిన కరపత్రల్ని ప్రతి ఒక్కరికీ అందిస్తున్నారు. అట్టడుగు వర్గాల జీవితాల్లో మార్పు రావాలంటే అది ఓటుతోనే సాధ్యమవుతుందని వేదిక సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఓటరు చైతన్య పాదయాత్రను రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జరిపేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని బృందం సభ్యులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తయ్యాక మిగతా లోక్‌సభ నియోజవర్గాలలో పాదయాత్ర కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రజల సమస్యలు, డిమాండ్లు తెలుసుకుని మేనిఫెస్టోలో పెట్టేలా కృషి చేస్తున్నాం. రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును ప్రజలు సరిగ్గా వినియోగించుకునేందుకు చైతన్యం పరుస్తున్నాం. వరంగల్ జిల్లా ఓటు హక్కు అవగాహనపై పాదయాత్ర కొనసాగిస్తున్నామని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు అన్నారు.
Vote cast in Parliament elections