Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Additional Collector J. Srinivas: గ్రూప్-2 పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి :అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్

ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఈ నెల 15,16 తేదీలలో నిర్వహించనున్న గ్రూప్- 2 పరీక్ష లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆయన తన ఛాంబర్ లో గ్రూప్-2 పరీక్షల నిర్వహణ విషయమై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.నల్గొండ జిల్లాలో గ్రూప్-2 పరీక్షలకు 29118 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, ఇందుకుగాను నల్గొండ లో 59, మిర్యాలగూడ పట్టణంలో 28, మొత్తం 87 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నల్గొండ నుండి 21,777 మంది అభ్యర్థులు, మిర్యాలగూడ నుండి 7941 మంది మొత్తం 29118 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు.గ్రూప్ -2 పరీక్షలను జిల్లాలో సవ్యంగా నిర్వహించేందుకుగాను 3 రీజనల్ కో-ఆర్డినేటర్లను, 99 మంది డిపార్ట్మెంటల్ అధికారులను, 31 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను, 17 మంది జాయింట్ రూట్ ఆఫీసర్లను, 244 మంది ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లను నియమించినట్లు ఆయన వెల్లడించారు.పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగినంత బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులతో కోరారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన తనిఖీ ఏర్పాట్లు చేయాలని, అభ్యర్థులు ఎవరు పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకుండా మహిళ,పురుష అభ్యర్థులకు వేరు వేరుగా తనిఖీలు నిర్వహించాలని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటిండెంట్లకు చెప్పారు.

పరీక్ష నిర్వహిస్తున్న 15 ,16 తేదీలలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని ట్రాన్స్కో అధికారులను, తగినన్ని బస్సులు పెంచాలని ఆర్టీసీ అధికారులను, అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైనంత మెడికల్ సిబ్బందితోపాటు, ప్రథమ చికిత్స కిట్లను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను, పరీక్ష కేంద్రాల పరిధిలో పరిశుభ్రత ఉండేలా చూసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు నియమించబడిన ఆర్సివోలు పరీక్ష కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలను కల్పించాలన్నారు. గ్రూప్- 2 పరీక్షలు నిర్వహిస్తున్న అన్ని ప్రభుత్వ సంస్థలకు ఈ నెల 15, 16న స్థానిక సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. పరీక్షలు నిర్వహించే రెండు రోజులు పరీక్షాకేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ విధించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పరీక్షలు నిర్వహించే సమయంలో చుట్టుపక్కల ఉన్న జిరాక్స్ కేంద్రాలను తప్పనిసరిగా మూసివేయాలని ఆయన అన్నారు.
గ్రూప్-2పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు,మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్ లలో నిర్వహించ నున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గ్రూప్ -2 పరీక్షలు రాసే అభ్యర్థులకు ఈ క్రింది సూచనలు చేశారు.

అభ్యర్థులకు సూచనలు:
అభ్యర్థులు హాల్ టికెట్లను ఈ నెల 9 వ తేదీ నుండి డౌన్ లోడ్ చేసుకోవటానికి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం పరీక్షకు 08:30 గంటల నుండి, మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు .
ఉదయం 9:30 గంటలకు, మధ్యాహ్నo 2:30 గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసివేయడం జరుగుతుందని, గేట్‌లు మూసివేసిన తర్వాత అభ్యర్థులెవరూ పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి అనుమతించడం జరుగదని తెలిపారు.అభ్యర్థులు నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్నులు, ఫోటో అతికించిన హాల్ టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డ్‌ని మాత్రమే పరీక్ష హాల్‌లోకి తీసుకు రావాలని అన్నారు.

అభ్యర్థి ఫోటోగ్రాఫ్, సంతకం ముద్రించిన చిత్రాలు స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే హాల్ టిక్కెట్ చెల్లుబాటు అవుతుందని,దీన్ని నిర్ధారించుకోవడానికి లేజర్ ప్రింటర్‌, ప్రాధాన్యంగా కలర్ ప్రింటర్‌తో A4 సైజు కాగితంపై ముద్రించిన హాల్ టికెట్‌ని తీసుకు రావాలని తెలిపారు. పరీక్షా కేంద్రానికి వచ్చే ముందు ముద్రించిన హాల్‌టికెట్‌లోని నిర్దేశిత స్థలంలోఇటీవలి పాస్‌పోర్టు సైజు ఫొటోను గమ్‌తో అతికించాలని,లేకుంటే అభ్యర్థి దరఖాస్తు తిరస్కరణకు గురవుతుందని తెలిపారు.డౌన్‌లోడ్ చేసిన హాల్ టిక్కెట్‌లో అస్పష్టమైన/తగు విధంగా లేని ఫోటో గ్రాఫ్ ఉంటే, అభ్యర్థి మూడు పాస్‌ పోర్ట్ సైజు ఫోటోలను సక్రమంగా అండర్ టేకింగ్‌తో పాటు (www.tspsc.gov వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫార్మాట్‌తో పాటుగా చివరిగా విద్యను అభ్యసించిన సంస్థ గెజిటెడ్ అధికారి/ప్రిన్సిపాల్ చేత ధృవీకరించి తీసుకురావాలని, పరీక్ష హాల్‌లోని ఇన్విజిలేటర్‌కు అప్పగించాలని లేనట్లయితే పరీక్ష హాల్ లోకి అనుమతించడం జరగదని తెలిపారు.

అభ్యర్థులు పరీక్షకు కనీసం ఒకరోజు ముందుగా పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని తెలిపారు.అభ్యర్థులు కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, వాలెట్, హ్యాండ్‌బ్యాగ్‌లు, పౌచ్‌లు, రైటింగ్ ప్యాడ్‌లు, నోట్స్, చార్ట్‌లు, లూజ్ షీట్‌లు, ఆభరణాలు ,ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు లేదా రికార్డింగ్ సాధనాలు పరీక్ష కేంద్రం లోకి తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.అభ్యర్థి చెప్పులు ధరించాలని, బూట్లు ధరించ రాదని సూచించారు. అభ్యర్థుల విలువైన వస్తువులు లేదా వస్తువులను భద్రపరచడానికి కమిషన్ ఎలాంటి క్లాక్ రూమ్/స్టోరేజీ సౌకర్యాన్ని కల్పించదని చెప్పారు.

అభ్యర్థి ఆన్‌లైన్ అప్లికేషన్‌లో స్క్రైబ్ / కాంపెన్సేటరీ సమయం క్లెయిమ్ చేసిన పిడబ్ల్యుడి అభ్యర్థులకు, వారు స్క్రైబ్ లేదా పరిహార సమయానికి అర్హులని వారి హాల్ టిక్కెట్‌పై ముద్రించడం జరిగిందని, వారు తప్పనిసరిగా సదరమ్ సర్టిఫికేట్/APPENDIX-III ని చీఫ్ సూపరింటెండెంట్‌కు చూపించాలని తెలిపారు.స్క్రైబ్ లేదా పరిహార సమయాన్ని క్లెయిమ్ చేయడానికి పరీక్ష రోజున హాల్ టికెట్ స్క్రైబ్ అనుమతించబడిన అభ్యర్థులకు మాత్రమే టీజీపీఎస్సీ ద్వారా స్క్రైబ్ నియమించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఆర్ఓ అమరేందర్ ,నల్గొండ, మిర్యాలగూడ డి.ఎస్.పిలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు హాజరయ్యారు.