Bommidi Nagesh: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ :నిజాం రజాకార్ సైన్యాలకు, పటేల్, పట్వారి, జాగిర్దారులు, దేశముఖ్, భూస్వాములు కొనసాగించిన దోపిడీ, పీడన, అణిచివేత వెట్టి చాకిరిని వ్యతిరేకిస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కొనసాగిందని నెహ్రూ, పటేల్ సైన్యాలు నిజాం రజాకార్ సైన్యాల అరాచకాలను అణిచివేస్తామనే పేరుతో వచ్చి, హైదరాబాద్ స్టేట్ కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్తుందని 4,000 మంది పైగా కమ్యూనిస్టులను ఊచకోత కోసారని సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అన్నారు. నల్లగొండ పట్టణం కేంద్రంలోని సీపీఐ (cpi) ఎం ఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 విద్రోహ సభను బొమ్మిడి నగేష్ (Bommidi Nagesh) అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ పాల్గొని మాట్లాడుతూ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కేంద్రంగా దున్నేవానికి భూమి కావాలని లక్ష్యంగా కొనసాగిందన్నారు. రజాకార్ సైన్యాలు ప్రజలను చుట్టుముట్టి దాడులకు ప్రయత్నించినప్పుడు ప్రజలు కారంపొట్లాలు, కర్రలు, రాళ్లు, ఒడిశాలలె తమ ఆయుధాలుగా మలుచుకొని వారిని తరిమికొట్టడంలో ముఖ్యపాత్ర పోషించారని అన్నారు. అసమానతలు లేని సమాజం కోసం సాయుధ పోరాటం కొనసాగిందని ఆ మార్గంలో నేటి యువత పోరాడాలని పిలుపునిచ్చారు.
నిజాం కాలంలో ప్రజలు అనేక అణిచివేతలకు గురయ్యారని, విపరీతమైన పన్నులు వసూలు చేస్తూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారని, అన్ని కులాల వారితో వివిధ రకాల వెట్టి చాకిరి చేయించుకొని, శ్రమకు తగిన ఫలితం ఇవ్వలేదని దీనితో ప్రజల్లో అసంతృప్తి, అగ్రహా జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిన పరిస్థితి ఉందన్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం (Communist Party leadership) నిజాం కు వ్యతిరేకంగా బలమైన పోరాటాలు చేశారన్నారు.10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారని, మూడు వేల గ్రామాలలో రాజ్యాధికారం ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. ఎన్నో విజయాల సాధించుకున్నారని అన్నారు. నెహ్రూ ప్రభుత్వం (Nehru Govt)దేశంలో అధికారంలోకి వచ్చి హైదరాబాద్ స్టేట్ లో కమ్యూనిస్టులు సాధించుకున్న విజయాలను అణిచివేయడంతో తిరిగి భూస్వాముల చేతుల్లోకి పాలన వెళ్లిందని, ప్రజలు సాధించుకున్నవి కోల్పోయారని అందుకే ముమ్మాటికి తెలంగాణకు విద్రోహమే జరిగిందని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ రకాలుగా వ్యాఖ్యానాలు చేయడం సరికాదని అన్నారు. బీజేపీ ఈ పోరాటాన్ని హిందూ ముస్లిం పొరటంగా చరిత్రను వక్రీకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ నాయకులు బి.వి చారి, ఎల్.సుధాకర్, కె.సంజయ్, మదూకర్, రాజు, వెంకన్న, శంకర్, నర్సింహ, వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.