CITU: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీం లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పవద్దని ప్రభుత్వమే సంక్షేమ పథకాలు కార్మికులకు అమలు చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (CITU) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీ నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్ లో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (CITU) నల్గొండ (Nalgonda) జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం బైరం దయానంద అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు (Welfare Board) ద్వారా అమలవుతున్న ప్రమాద, సహజ మరణం, శాశ్వత పాక్షిక అంగవైకల్యం తదితర సంక్షేమ పథకాలను భీమా కంపెనీలకు అప్పజెప్పాలని ఆలోచన చేస్తుందని., ఇది విరమించుకోకపోతే కార్మిక వర్గ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రెట్టింపు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాలు పోరాడుతుంటే ఉన్న వెల్ఫేర్ బోర్డునే నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెల్ఫేర్ బోర్డులో 5500 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయని వాటిని కార్మి కుల సంక్షేమాన్ని కాకుండా ఇష్టం వచ్చినట్లుగా దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ అనుమతి లేకుండా బోర్డు నిధులు ఖర్చు చేయరాదని నిబంధన ఉన్న పాటించడం లేదని అన్నారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్న ఈ పథకాలను బీమా కంపెనీలకు అప్పచెప్పితే బోర్డు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని సెస్సునిధులు వసూలు చేయరని దీనివలన బీమా కంపెనీలకు అధికారులకు ఏజెంట్లకు కమిషనర్లు తప్ప కార్మికులకు ఏ రకమైన ప్రయోజనం ఉండదని అన్నారు. వెల్ఫేర్ బోర్డు స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పవద్దని భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దశల వారి పోరాట కార్యాచరణ చేస్తున్నామని ఇందులో భాగంగా సెప్టెంబర్ 12 నుండి 15 వరకు సంతకాల సేకరణ, 16న కలెక్టరేట్ ధర్నా, 19,20,21 తేదీల్లో అడ్డా పని ప్రదేశాల్లో సమావేశాలు, 23న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో నిర్మాణరంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, పి సత్యనారాయణ, సిఐటియు జిల్లా నాయకులు జిట్ట నగేష్, ఎస్ కె బషీర్,యూనియన్ జిల్లా నాయకులు బోల్లెద్దు సైదులు, జ్యోతి, బి వెంకటయ్య,జి వెంకన్న, సిహెచ్ సురేష్, ఎం రామకృష్ణ, హుస్సేన్, రోశయ్య, ధనమ్మ,పి అంజయ్య,శంకర్, గురువయ్య వెంకటరెడ్డి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.