Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Tripathi: పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను రూపొందించాలి

ప్రజాదీవెన, నల్గొండ : నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు లబ్జిదారుల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.మోడల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పురోగతిలో ఉన్న ఇళ్ల నిర్మాణాల పూర్తి, లబ్ధిదారుల జాబితా తయారీపై అధికారులు దృష్టి సారించాల్సిందిగా ఆమె ఆదేశించారు.శనివారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై గృహ నిర్మాణ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్షించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండు లేదా మూడు మోడల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని తెలిపారు. అలాగే పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు తహసిల్దార్లు జాబితా రూపొందించాలని చెప్పారు. లబ్ధిదారుల జాబితా పూర్తి పారదర్శకంగా ఉండాలని, ఈ విషయంలో తహసీల్దార్లదే కీలక పాత్ర అని, ఈ కసరత్తును పూర్తి సాఫీగా నిర్వహించాలని, ఏలాంటి ఫిర్యాదులు లేకుండా జాబితా తయారు చేయాలన్నారు. ఇదివరకే నిర్మాణాలు చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు .

ముఖ్యంగా ఇండ్లకు విద్యుత్తు, తాగునీరు, రోడ్లు, తదితర మౌలిక సదుపాయాలపై ఆమె సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసిందని, ఇందుకు సంబంధించి త్వరితగతిన సౌకర్యాలు కల్పించి నిర్మాణాలు పూర్తి చేయడంపై దృష్టి సారించాలన్నారు.గతంలో ఇళ్లపట్టాలు పొందిన వారు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంద్రమ్మ ఇండ్ల సర్వే సందర్భంగా ఇల్లు నిర్మించుకునేందుకు వివరాలు ఇస్తున్నారని, అలాంటి వాటికి సంబంధించి మరోసారి రెవెన్యూ అధికారులు ఇంటి సైట్, సర్వే నంబర్ తో సహా విచారణ చేయాలని, గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల పరిస్థితులపై నివేదిక తయారు చేయాలని చెప్పారు.గృహ నిర్మాణ శాఖ పీడి రాజకుమార్, ఆర్డబ్ల్యూఎస్సీ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎస్ ఈ తిరుపతయ్య, ట్రాన్స్కో ఎస్ ఈ వెంకటేశ్వరరావు, ఆయా ఇంజనీరింగ్ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.