ప్రజాదీవెన, నల్గొండ : నల్గొండ అర్బన్ కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ సముదాయంలో చిన్న చిన్న మరమ్మతులన్నింటిని జనవరి15 లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.ఆదివారం ఆమె సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వెనకవైపు నిర్మిస్తున్న నల్గొండ అర్బన్ కాలనీలోని ఇండ్లను తనిఖీ చేశారు.ఇది వరకే నిర్మించిన ఇళ్లలో చిన్న చిన్న రిపేరీలకు సంబంధించి అంచనాలను రూపొందించి జనవరి 15 లోపు పూర్తి చేయాలని అన్నారు.
అలాగే అర్బన్ కాలనీలో మౌలిక వసతులకు సంబంధించి తాగునీటి సరఫరా, మరియు మురుగునీటి పనులు,విద్యుత్తు తదితర పనులన్నింటిని పూర్తి చేయాలని ఆదేశించారు.కాగా ఈ కాలనీలో సుమారు 550 గృహాలు జి ప్లస్ టు మోడల్ లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే .ఈ సందర్భంగా అధికారులు ఇదివరకే నిర్మించిన ఇండ్లను బ్లాకుల వారిగా చిన్న చిన్న డ్యామేజీల మరమతులను పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గృహ నిర్మాణం పీడీ రాజకుమార్, పంచాయతి రాజ్ ఎస్ ఈ తిరుపతయ్య, ఈ ఈ పిఆర్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.