ప్రజాదీవెన, నల్గొండ : మండల పంచాయతీ అధికారులు ప్రతిరోజు గ్రామాలలో పారిశుద్ధ్యం, తాగునీటిపై పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.శనివారం ఆమె కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో పారిశుద్ధ్యం, తాగునీరు, తదితర అంశాలపై ఎం పి ఓ లతో సమీక్షించారు.పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. గ్రామం తో పాటు, అన్ని ప్రభుత్వ సంస్థల్లో పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని చెప్పారు.
ప్రతిరోజు శానిటేషన్ ,తాగునీటిపై పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ రెండు అంశాలతో పాటు , గ్రామాలలో తప్పనిసరిగా చేయాల్సిన పనులను తూ.చా తప్పకుండా చేయాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఎంపీ ఓలు విధులకు గైర్హాజరు కావద్దని, ఒకవేళ గైర్హాజరైనట్లయితే వారి సర్వీస్ ను డైస్ నాన్ కింద పరిగణిస్తామన్నారు .గ్రామంలోచేపట్టే అన్ని పనులు నాణ్యతతో ఉండాలని చెప్పారు.డివిజనల్ పంచాయతీ అధికారులు వారి పరిధిలో గ్రామ పంచాయతీలకు సంబంధించి పారిశుద్ధ్యం తాగునీటి సరఫరా అన్ని అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని, జిల్లా స్థాయి వరకు సమస్యలు తీసుకురావద్దని చెప్పారు.
గ్రామపంచాయతీలలో జనవరి 15 లోగా పన్నువసూళ్లను పూర్తి చేయాలని చెప్పారు.పంచాయతీ కార్యదర్శులు ఈ నెల 31 నాటికి ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి మురళి, హౌసింగ్ పీడీ రాజకుమార్, ఎంపీఓలు ఈ సమావేశానికి హాజరయ్యారు.