Collector Tripathi: ప్రజాదీవెన, నల్గొండ :నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం దేవరకొండ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలోని మాత శిశు సంరక్షణ విభాగాన్ని ,క్యాజువాలిటీని, డయాలసిస్ విభాగాలను తనిఖీ చేసి అక్కడ సౌకర్యాలు, రోగుల వివరాలను సూపరింటెండెంట్ బి. మంగ్త్య నాయక్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అంతేకాక ఆసుపత్రికి వస్తున్న రోగుల వివరాలను, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్లను తనిఖీ చేసి పరిశీలించారు. ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన రోగులతో ముఖాముఖి మాట్లాడి సమయానికి వైద్యులు ఆసుపత్రికి వస్తున్నారా ఎవరైనా మిమ్మల్ని వైద్యం కోసం డబ్బులు అడుగుతున్నారా, వైద్య చికిత్సలు ఎలా అందిస్తున్నారు అని ఆరా తీశారు.
ఆసుపత్రి సూపరింటీండెంట్, వైద్యులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగగా,నీటి సమస్య ఉందని, సూపరింటిండెంట్ జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతోపాటు, రాత్రి సమయాల్లో కొంతమంది మద్యం తాగి ఆసుపత్రికి వస్తున్నారని అందువల్ల ఆస్పత్రి ఆవరణలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా, పోలీసు అధికారులతో మాట్లాడి పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు అంతేకాక ఆసుపత్రిలో నెలకొన్న నీటి సమస్యను తక్షణమే తీర్చాలని దేవరకొండ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య ఎలా ఉందని డాక్టర్ల పనితీరు తదితర విషయాలను అడిగి కనుక్కున్నారు. దేవరకొండ ప్రాంతంలో మొత్తం గిరిజనులు ఎక్కువగా ఉంటారని, వారందరికీ మంచి వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా దేవరకొండ పరిధిలో మాత, శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని వీటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె డాక్టర్లను ఆదేశించారు. ఆసుపత్రిలోకి పశువులు, జంతువుల వంటివి రాకుండా గేటు వద్ద పశువుల ట్రాప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అనంతరం జిల్లా కలెక్టర్ దేవరకొండ మున్సిపల్ పరిధిలోని తాటికల్ రోడ్ లో నిర్వహిస్తున్న రేషన్ కార్డుల సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే ఎలా చేస్తున్నారని సర్వే బృందాలతో అడిగి తెలుసుకున్నారు .రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన మేరకు నూతన రేషన్ కార్డులకు అర్హత ఉన్న వాటిని ఎంపిక చేయాలని, ప్రత్యేకించి అర్హత జాబితా తయారులో ఆదాయం, ఇతర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేసే విధంగా చూడాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు .దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, ఏరియా ఆసుపత్రి సూపరింటిండెంట్ భీ. మంగత్య నాయక్ ,తహసిల్దార్, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.