ప్రజాదీవెన, నల్గొండ: కనగల్ మండలానికి మంజూరైన జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి స్థల పరిశీలన,కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టల్లు, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య లోపం, మధ్యాహ్న భోజనంలో పరిశుభ్రత ,నాణ్యత లేకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు.నల్గొండ జిల్లా, కనగల్ మండలానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జూనియర్ కళాశాలను మంజూరు చేయగా ,కళాశాల భవన నిర్మాణానికి స్థల పరిశీలన నిమిత్తం సోమవారం జిల్లా కలెక్టర్ కనగల్ మండల కేంద్రానికి వచ్చారు.ముందుగా ఎస్ఎల్బీసీ ఆవరణలో ఉన్న తాసిల్దార్ కార్యాలయ చుట్టుపక్కల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత సర్వేనెంబర్ 591లో కేజీబీవీ పక్కన స్థలాన్ని చూశారు.
అంతేకాక 339 సర్వే నెంబర్లో పల్లె ప్రకృతి వనం వద్ద కలెక్టర్ స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం గతవారం కనగల్ ,తిప్పర్తి మండలాలకు జూనియర్ కళాశాలలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే .అయితే కనగల్ మండలంలో జూనియర్ కళాశాల తో పాటు, ప్రతిక్ ఫౌండేషన్ సహకారంతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి స్థలాన్ని చూడాలన్న రాష్ట్ర రోడ్లు,భవనాలు ,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సోమవారం ఉదయమే స్థల పరిశీలన చేశారు.కాగా జూనియర్ కళాశాల, ఇండోర్ స్టేడియం రెండింటికి సుమారు 10 ఎకరాల స్థలం అవసరం ఉంది. ఈ స్థల సేకరణకై పైన పేర్కొన్న మూడు ప్రదేశాలలో జిల్లా కలెక్టర్, నల్గొండ ఆర్డిఓ అశోక్ రెడ్డి ,తాసిల్దార్ పద్మ లతో కలిసి స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పక్కనే ఉన్న కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయానికి వెళ్లి వంటగదిని,పాఠశాల పరిసరాలను, పాత్రలు శుభ్రం చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. కిచెన్,పాఠశాల ఆవరణలో పరిశుభ్రత లోపించడంపై ప్రిన్సిపాల్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కనగల్ కేజీబీవీలో మొత్తం 230 మంది విద్యార్థులు ఉండగా, 3 తరగతి గదులలో బెంచీలు లేక విద్యార్థులు కింద కూర్చోవడం గమనించిన జిల్లా కలెక్టర్ తక్షణమే బెంచీల ఏర్పాటు కై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కు లేఖ రాయాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. అంతేకాక కేజీబీవీలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు.