ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేపట్టనున్న కొత్త ఆసుపత్రి బ్లాక్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఆమె ప్రభుత్వ ప్రధానాస్పత్రిని సందర్శించి నూతన బ్లాక్ ల నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని పరిశీలించారు.కాగా ఇటీవలే ప్రభుత్వ మెడికల్ కళాశాల నూతన భవనంలోకి మారగా, గతంలో నిర్వహించిన ఓపి బ్లాక్ ను పూర్తిగా తీసివేసి ఈ రెండింటి స్థానంలో నూతన ఆసుపత్రి భవనం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 32 కోట్ల రూపాయలను ఇదివరకు విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా తక్షణమే మెడికల్ కళాశాల సామాగ్రిని అంతటిని నూతన భవనానికి తరలించడం, మెడికల్ కళాశాల స్థానంలో నూతన బ్లాక్ ను నిర్మించేందుకు గోడను నిర్మించి పేషంట్లకు ఇబ్బంది కలగకుండా పనులు ప్రారంభించాలని ఆమె చెప్పారు. అలాగే నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ విభాగాన్ని రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.నూతన పనులు త్వరగా ప్రారంభించినట్లయితే నూతన ఆసుపత్రి భవనం సైతం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ చెప్పారు.జిల్లా ప్రధాన ఆస్పత్రి. సూపరింటిండెంట్ అరుణకుమారి, టి ఎస్ ఎం ఐ డి సి ఈ ఈ జైపాల్ రెడ్డి, కాంట్రాక్టర్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.