Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

సంప్రదాయం ప్రకారం శునకానికి అంత్యక్రియలు

విశ్వాసంలో శునకానికి మించిన జంతువు మరొకటి లేదు. చాలామంది పెంపుడు కుక్కలను తమ కుటుంబ సభ్యుల మాదిరిగా అల్లారు ముద్దుగా చూసుకుంటారు. వాటితో అనుబంధాన్నిపెంచుకుంటారు.

ప్రజాదీవెన, కోదాడ: విశ్వాసంలో శునకానికి (dog) మించిన జంతువు మరొకటి లేదు. చాలామంది పెంపుడు కుక్కలను తమ కుటుంబ సభ్యుల మాదిరిగా అల్లారు ముద్దుగా చూసుకుంటారు. వాటితో అనుబంధాన్నిపెంచుకుంటారు. వాటికి ఏచిన్న హాని కలిగినా తల్లడిల్లిపోతారు. ఆ మూగ జీవులు కూడా తమ యజమాని పట్ల అదే ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటాయి. యజమాని కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి. పెంచుకున్న శునకం చనిపోవడంతో సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించి దానిపై ఉన్న మమకారాన్ని చాటుకున్నాడు ఓ జంతు ప్రేమికుడు.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని నయానగర్‌కు చెందిన భూసాని మల్లారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు పిల్లలు లేరు. పిల్లలు లేని లోటుతో ఈ దంపతులు మానసికంగా కుంగిపోయారు. దీంతో వారు పదిహేనేళ్ల క్రితం ఓ శునకాన్ని తెచ్చుకొని స్వీటి అని పేరు కూడా పెట్టుకున్నారు. ఆ శునకాన్ని చిన్న పిల్లల మాదిరిగా అల్లారు ముద్దుగా పెంచారు. ఆ శునకం కూడా వారికి కుటుంబ సభ్యుడిగా మారిపోయింది. ఆ శునకానికి ప్రతి ఏటా బంధు మిత్రుల మధ్య బర్త్ డే వేడుకలను నిర్వహించేవారు.

15ఏళ్లుగా కుటుంబసభ్యుడిలా పెంచుకున్న శునకం(dog) మృతిచెందడంతో ఆ దంపతులు తట్టుకోలేక పోయారు. మనుషులు చనిపోతే చేసే విధంగానే ఆ శునకానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ శునకాన్ని ఇంటి ముందు ఉంచి.. పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్యాండ్‌ మేళాన్ని ఏర్పాటు చేసి వాహనంలో కోదాడ శివారులోని తన వ్యవసాయ పొలానికి తీసుకెళ్ళి ఆ దంపతులు శాస్త్రోక్తంగా ఖననం చేశారు. స్థానికులు, బంధువులను పిలిచి ఆ శునకానికి చిన్న, పెద్ద కర్మ కాండలు కూడా నిర్వహించారు. కుటుంబ సభ్యుడిగా పెంచుకున్న ఆ శునకం.. తమకు పిల్లలు లేనిలోటు తీర్చిందని మల్లారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులు చెబుతున్నారు.

Dog funeral in kodad