–రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Ganesh Immersion: ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జనం (Ganesh Immersion) ప్రశాంతంగా నిర్వహించాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి (Komatireddy Venkatareddy Reddy) పిలుపునిచ్చారు. మతం కన్నా మానవత్వం ముఖ్యమని ఆయన అన్నారు. నల్గొండ జిల్లా మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని, గడచిన 30 సంవత్సరాలలో జిల్లాలో ఎలాంటి చిన్న సంఘటనలు సైతం చోటు చేసుకోలేదని తెలిపారు. గతంలో లాగే ఈ సంవత్సరం సైతం వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన గణేష్ ఉత్సవ కమిటీలకు, యువతకు పిలుపునిచ్చారు .
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో (Vinayaka Navratri Celebrations) భాగంగా సోమవారం ఆయన నల్గొండ (Nalgonda) జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ (Hanuman Nagar) ఒకటవ వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గణేష్ శోభాయాత్రను జిల్లా అంతట సంతోషంగా జరుపుకోవాలని, ఎలాంటి విఘ్నాలకు తావు లేకుండా నిమజ్జనం చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరు మతం కన్నా మానవత్వంతో పనిచేయాలని, పేదలను ఆదుకోవడమే మన ఆశయం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగా ఇదివరకే ఈద్గాను అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామని, అలాగే ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సైతం అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.
నల్గొండ జిల్లాను రాష్ట్రం లోనే మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తున్నానని, ముఖ్యంగా 2000 కోట్ల రూపాయలతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ పనులకు త్వరలోనే కేంద్ర మంత్రి గడ్కరి(Union Minister Gadkari) తో శంకుస్థాపన చేయించనున్నామని, 450 కోట్ల రూపాయలతో నల్గొండ పట్టణంలో రోడ్లు, డ్రైన్ల వంటి పనులు జరుగుతున్నాయని, పది లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 10 తాగు నీటి ట్యాంకులు, 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 5 తాగునీటి ట్యాంకులు స్లాబ్ దశకు చేరుకున్నాయని, త్వరలోనే పనులు పూర్తయితాయని చెప్పారు.
2 సంవత్సరాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు, సిసి రోడ్లను పూర్తి చేస్తామన్నారు .పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకుగాను హౌసింగ్ బోర్డ్ కి చెందిన 50 ఎకరాల స్థలాన్ని సేకరించడం జరిగిందని, మరో 25 ఎకరాలలో 80 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పనులు త్వరలోనే ప్రారంభించనున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అందరినీ కలుపుకుని నిమజ్జనాన్ని శాంతియుతంగా జరపాలన్నారు. అంతేకాక జిల్లా వ్యాప్తంగా నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆయన ఉత్సవ కమిటీలకు అలాగే అధికారులు, యువతకు సూచించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల, అలాగే గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగే చోట ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందని, అక్కడ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు 600 మంది పోలీసులు, అధికారులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని, సీసీ కెమెరాలతో పాటు, డ్రోన్ కెమెరాలను సైతం వినియోగిస్తున్నామని, యువత ఎక్కడ రెచ్చ గొట్టే చర్యలకు పాల్పడవద్దని, శాంతియుతంగా నిమజ్జనం జరిగేందుకు సహకరించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు విజయకుమార్, వక్త అప్పల ప్రసాద్, చింత సాంబమూర్తి, శాంతి కమిటీ సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఖలీమ్, ఆఫీస్, గోలీ మధుసూదన్ రెడ్డి, సంపత్, నాగం వర్షిత్ రెడ్డి తదితరులు మాట్లాడారు.
జిల్లాలో ప్రత్యేకించి నల్గొండ పట్టణంలో వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు కృషిచేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డిఎస్పి, పోలీసు అధికారులు, ఆర్డీవో ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులను మంత్రి శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, అబ్బగోని రమేష్ గౌడ్, డీఎస్పీ శివరాంరెడ్డి, ఆర్డిఓ రవి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, తహసిల్దార్ శ్రీనివాస్, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు ఉన్నారు.