ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న ప్రజా పంపిణీ పథకం రేషన్‌కార్డు కల్గిన 3 కోట్ల వినియోగదారులకు పంపిణీ చేస్తున్న నిత్యావసర వస్తువులను మండల పాయింట్లలో పనిచేస్తున్న హమాలీ కార్మికులు 40 సంవత్సరాల నుండి ప్రజా పంపిణీ పథకాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు హమాలీ కార్మికులు తమ వీపులపై క్వింటాల్ల కొద్ది బరువులు మోస్తూ 187 మండల పాయింట్లలలో ఎగుమతి, దిగుమతి చేస్తుంటే, ప్రభుత్వం సివిల్ సప్లయిస్ హమాలీలను కార్మికులుగా గుర్తించకుండా శ్రమదోపిడికి పాల్పడుతున్నారని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి, సివిల్ సప్లయిస్ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలుపుకో న్నందుకు నిరసనగా బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో హమాలి కార్మికులు సమ్మె చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అనేక పోరాటాల, ఉద్యమాల తర్వాత ప్రభుత్వం యూనియన్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెంచి అమలు చేస్తామని అంగీకరించి, అమలు చేయకుండా దాటవేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
రాష్ట్రంలో 3600 హమాలీలు 160 మంది మహిళా కార్మికులు మండల పాయింట్లలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం జనవరి 2024 నుండి హమాలీ రేట్లను పెంచి అమలు చేస్తామని కమీషనర్ సమక్షంలో జరిగిన చర్చలలో ప్రతి క్వింటాల్ ఎగుమతి, దిగుమతికి రూ.29/`లు చెల్లిస్తామని 04.10.2024న ఒప్పందం జరిగినా జి.ఓ.విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయటాన్ని ఆయన విమర్శించారు. డిసెంబర్ 18న వందలాది మంది హమాలీ కార్మికులు సివిల్ సప్లయిస్ కార్యాలయాన్ని ముట్టడిరచి వెంటనే జి.ఓ.విడుదల చేసి పెరిగిన హమాలీ రేట్లను బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేసి, డిసెంబర్ 31 లోపు జి.ఓ.విడుదల చేసి బకాయిలు చెల్లించకుంటే 1 జనవరి 2025 నుండి నిరవధిక సమ్మె చేస్తామని సమ్మె నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవటాన్ని ఆయన నిశితంగా విమర్శించారు.
ప్రభుత్వ యాజమాన్య సంస్థ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఆదర్శ సంస్థగా ఉండాల్సిన కార్పొరేషన్ చేసిన నిర్ణయాలను అమలు చేయకుండా సంవత్సరం గడిచిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆయన విమర్శించారు. సివిల్ సప్లయిస్ హమాలీలకు, మహిళా కార్మికులకు ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లకు వెంటనే విడుదల చేసి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం సివిల్ సప్లయిస్ గోడోన్‌లలో సొంత గోడౌన్లు నిర్మించకుండా అద్దె గోడౌన్‌లలో కొనసాగిస్తూ లక్షలాది రూపాయలను ప్రైవేటువారికి దారాదత్తం చేయటం ప్రభుత్వానికి విపరీతమైన నష్టం వస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జి.ఓ. ప్రకారం అన్ని మండల పాయింట్లలలో సొంతగోడౌన్‌లు నిర్మించి, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
హమాలీ కార్మికులకు ఇయస్‌ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి కార్పొరేషన్ అధికారులకు విజ్ఞప్తి చేసినా ఇయస్‌ఐ సౌకర్యం కల్పించనందున, ప్రభుత్వం వెంటనే హమాలీ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని ఆయన కోరారు. ప్రభుత్వం హమాలీ కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించి, పెన్షన్ సౌకర్యాన్ని కల్పించటంలో నిర్లక్ష్యం చేయటాన్ని ఆయన తప్పుబట్టారు. సివిల్ సప్లయిస్ హమాలీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే జి.ఓ.విడుదల చేసి బకాయి హమాలీ రేట్లను చెల్లించి సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌లో సమ్మెను ఆపాలని లేనిచో నిరవధిక సమ్మె కొనసాగుతుందని ఆయన హెచ్చరిక చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని గోదాంలలో ఎగుమతి దిగుమతి నిలిచిపోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అమాలీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దోనకొండ వెంకటేశ్వర్లు, జానయ్య, నాగరాజు, బుచ్చయ్య, గిరి యాదయ్య, లింగయ్య, సైదులు, ఎల్లయ్య, రామస్వామి, జానీ, శ్రీను లక్ష్మయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.