Kavitha : ఇంటెలిజెన్స్ ఎస్పీ కవిత పై వేటు, డీజీపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీస్ శాఖలో ఓ లేఖ కలకలం సృష్టిస్తుంది.
Kavitha : నల్గొండ జిల్లా : ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై ఏకంగా ఓ బాధితుడు 9 పేజీల లేఖ విడుదల చేశాడు.లేఖలో కళ్ళు బైర్లు కమ్మే అక్రమాలు బయటపెట్టాడు. ఎవరెవరి దగ్గర ఎంతెంత వసూళ్లు చేశారనే దానిపై లెక్కలతో సహా నివేదిక తయారు చేశాడు. దింతో గత 15 రోజులుగా కవిత అక్రమాలపై రాష్ట్ర నిఘా విభాగం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సొంత సిబ్బందితో పాటు రేషన్, గుట్కా మాఫీయా నుంచి అక్రమ వసూళ్లతో పాటు కింది స్థాయి సిబ్బంది వద్ద కూడా చేతివాటం ప్రదర్శించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వసూళ్ల ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే కవిత షాడో టీమ్ పైనా కూడా విచారణ కొనసాగుతోంది.
పోలీసు ఉన్నతాధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అక్రమాల్లో ఎస్ఐ,ముగ్గురు కానిస్టేబుల్లు, ఒక హెడ్ కానిస్టేబుల్ పాలుపంచుకున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. కవిత టీమ్ లో ఉన్న కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని..తన కూతురు బర్త్ డే ఫంక్షన్ పేరుతో పోలీసు సిబ్బంది నుంచి భారీగా వసూళ్లు చేశారని, అలాగే పోలీసు సిబ్బందికి రాఖీ కట్టి, బహుమతిగా ఖరీదైన చీరలు, బంగారం ఖాజేయడంతో పాటు ఓ సీఐ నుంచి చేయి బదులుగా రూ.14 లక్షలు తీసుకుని ఎగనామం పెట్టినట్టు బాధితుడు లేఖలో పేర్కొన్నాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో నల్గొండ జిల్లా ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. కవితను డీజీపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ శాఖ సమగ్ర విచారణ అనంతరం కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.