ఆసుపత్రిలో మంత్రి ఆకస్మిక పర్యటన
రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం ఉదయం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
హాస్టల్ లా బిల్డింగ్ ఏంటి? చాలా కంస్టడ్ గా ఉంది
పది రోజులుగా లిఫ్ట్ పని చేయకపోతే ఏం చేస్తున్నారు?
ఇంకా పాత జమానాలో నే ఉన్నట్టుంది
రెండు రోజుల్లో లిఫ్ట్ రిపేర్ కావాలి
వెయిటింగ్ హాల్ ను వెంటనే పూర్తి చేయించాలి
అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి
ప్రజా దీవెన నల్లగొండ: రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ (Komati reddy venkat reddy ) మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం ఉదయం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మాత శిశు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ గర్భిణీలు, డెలివరీ పేషెంట్లకు కావలసిన వసతుల పై ఆసుపత్రి సూపరింటెండెంట్ నిత్యానంద్, సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం విధుల్లో ఉన్న గైనకాలజిస్ట్ ల తో మాట్లాడారు. ఎంతమంది పేషెంట్ లు రోజు వస్తున్నారు? నార్మల్ డెలివరీ ల సంఖ్య ఎంత? గైనకాలజిస్ట్ లు ఎంతమంది పనిచేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ రికార్డులను పరిశీలించారు. ఎం సి హెచ్ బిల్డింగ్ కంజస్టెడ్ గా ఉంది. ఓ హాస్టల్ కు, కిరాణా షాప్ కు వెళ్లినట్టుగా ఉంది. పేషెంట్ సహాయకుల కోసం బయట వెయిటింగ్ రూమ్ కూడా లేదా అని అన్నారు.
ఈ సందర్భంగా తనతో పాటే ఉన్న సూపరింటెండెంట్ (Superintendent) తో మాట్లాడడంతో పాటు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడిన మంత్రి కావలసిన నిధులను ఏర్పాటు చేస్తామని నెలనర లోపు వెయిటింగ్ హాల్ ను పూర్తి చేయాలని, మరుగుదొడ్లను కట్టించాలని కావలసిన ఇతర సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో లిఫ్ట్ పనిచేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పది రోజులుగా లిఫ్ట్ పనిచేయకపోవడమేంటి? మీరంతా ఏం చేస్తున్నారు. ఇంకా పాత జమానా లోనే ఉన్నారా అంటూ మండిపడ్డారు. రెండు రోజుల్లో లిఫ్ట్ ను బాగు చేయించేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఆస్పత్రి సందర్శన లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంట నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, పలువురు కౌన్సిలర్లు, ఆస్పత్రి ఆర్ఎంఓ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇస్తనెమో ఇచ్చిండ్రు.. లేదంటే ఏజెన్సీ క్యాన్సిల్..
జీతాలు పెంచి ఇవ్వాలని కోరుతూ నల్లగొండ జిజిహెచ్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులు ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీకి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి తమ ఆవేదనను వెల్లడించారు.వేతనాలను తక్కువగా ఇస్తున్నారని వేతనాలు పెంచి ఇప్పించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీతాలు పెంచి ఇస్తనేమో ఇచ్చిండ్రు. లేదంటే ఈ ఏజెన్సీ ని కూడా క్యాన్సల్ చేయించి నేరుగా జీతాలు ఇప్పిస్తా. ఎన్నికల కోడ్ కూడా అయిపోయినాక నెలలో రెండు, మూడు సార్లు ఇక్కడికి వస్తా. ఇక్కడే ఫైనల్ చేసి పోతా. మీరు కంగారు పడకండి. మీరు బాగుంటేనే అన్ని బాగుంటాయి అని అన్నారు. జీతాల విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల కార్మికులు సంతృప్తి వ్యక్తం చేశారు.
Komati reddy venkat reddy visit to hospital