ప్రజాదీవెన,నల్గొండ :సంక్రాంతి నుండి సాగు చేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసాను అమలు చేస్తామని రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అలాగే సంక్రాంతి నుండి కొత్త రేషన్ కార్డులు ,ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ఇందిరా స్వసక్తి మహిళ సంఘాలను బలోపేతం చేసేందుకు లక్ష కోట్ల రూపాయలను ఇచ్చి మహిళలను కోటీశ్వరులను చేస్తామని తెలిపారు.
శుక్రవారం అయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదీత్య భవన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు ఎల్పిజి కనెక్షన్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు ఇవ్వడం జరిగిందని, రెండు లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించడం జరిగిందని తెలిపారు. సంక్రాంతికి రైతు భరోసా కింద సాగులో ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామని, ధరణి అక్రమాలను రూపుమాపి రైతుల కు న్యాయం చేసేందుకు భూమాతను తీసుకువస్తున్నామని, జనవరి 2 నుండి భూభారతి పేరు పై భూదార్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తున్నదని చెప్పారు. త్వరలోనే గ్రామాలలో విఆర్వో వ్యవస్థను తీసుకురానున్నామని ఆయన వెల్లడించారు. సంక్రాంతి నుండి కొత్త రేషన్ కార్డులు , రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం, ఐటిపాములలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు 50 మంది మహిళలకు 50 లక్షల రూపాయల విలువచేసే సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేసి నెలకు అదనంగా మూడు నుండి నాలుగు వేల రూపాయల ఆదాయం పొందేలా సోలార్ విద్యుత్ యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఇలాంటి పథకం తెలంగాణలో ఎక్కడా లేదని, తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఇలాంటి పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రితో కోరడం జరిగిందని, దీనివల్ల మహిళలు కుటుంబానికి చేదోడు, వాదోడుగా ఉంటారని తెలిపారు. ఇటీవల బ్రాహ్మణ వెల్లేముల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సాగునీటిని విడుదల చేయడం జరిగిందని, దీనితో నల్గొండ చుట్టుపక్కల సశ్య శ్యామలమవుతుందని అన్నారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.