–ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలు లో ప్రభుత్వం
–రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమా టోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, మిర్యాలగూడ: నల్గొండ జిల్లాను బంగారు కొండగా చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)అన్నారు. బుధవారం అయన నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణం బైపాస్ వద్ద 180 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నాలుగు వెహికల్ అండర్ పాస్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అక్టోబర్ నుండి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులతో పాటు, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు రాష్ట్రప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నదని, ఇందులో భాగంగా ఇప్పటివరకు 85 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ను ఇస్తున్నామని, 200 యూనిట్లలోపు వారికి జీరో బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు.
ఆసియాలోనే అతిపెద్ద రైస్ ఇండస్ట్రీస్, అలాగే వాణిజ్యపరమైన పట్టణంగా పేరుపొందిన మిర్యాలగూడ పట్టణం జంక్షన్ లో నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు 180 కోట్ల రూపాయలతో వెహికల్ అండర్ పాసుల (Vehicle underpasses నిర్మాణాన్ని చేపట్టామని, త్వరలోనే పనులు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేస్తామన్నారు. 6 నెలల్లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా రెండు యూనిట్ల నుండి విద్యుత్ ఇవ్వనున్నామని, ఎస్ఎల్బీసీ సొరంగాన్ని రెండు సంవత్సరాలలో పూర్తి చేసి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి చెప్పారు. సాగునీటితో పాటు, నల్గొండ జిల్లా వ్యాప్తంగా డబుల్ రోడ్ల నిర్మాణం ,ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే తమ ధ్యేయమని ఆయన తెలిపారు.
మిర్యాలగూడ బైపాస్ వద్ద నిర్మిస్తున్న వెహికల్ అండర్ పాస్ కారణంగా భూమి కోల్పోతున్న బాధితులకు న్యాయపరంగా నష్టపరిహారం ఇస్తామని అన్నారు. మిర్యాలగూడ పట్టణ అభివృద్ధిలో భాగంగా ఇటీవల పార్లమెంట్ సభ్యులు రఘువీర్ అమృత్ పథకం కింద 316 కోట్ల రూపాయలను తీసుకురావడం జరిగిందని, దీనిద్వారా తాగునీటి ట్యాంకులతోపాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. గతంలోనే మిర్యాలగూడ నియోజకవర్గానికి డిగ్రీ కళాశాలని తీసుకురావడం జరిగిందని , ప్రస్తుతం 10 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (Skill Development Centre ను మంజూరు చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు
నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి (Raghuveer Reddy)మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఆర్థిక భారంలో ఉన్నప్పటికీ ప్రజల సౌకర్యార్థం అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, అంతేకాక గత ప్రభుత్వం చేపట్టి నిలిపివేసిన పనులను సైతం కొనసాగిస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధికి ముందుండి చేయూత నందిస్తామని, మిర్యాలగూడను అగ్రభాగాన నిలిపేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు .
నాగార్జునసాగర్ శాసనసభ్యులు వీర్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ బైపాస్ వద్ద ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ,దీనిని నివారించేందుకు 150 కోట్లతో వెహికల్ అండర్ పాసులు నిర్మిస్తున్నందుకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు .
జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy)మాట్లాడుతూ వాణిజ్యపరంగా అత్యధిక రైస్ మిల్లులు ఉన్న మిర్యాలగూడ వంటి పట్టణంలో వెహికల్ అండర్ పాస్ నిర్మాణం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా కాపాడుకోవచ్చని, ఈ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు. మిర్యాలగూడ పట్టణం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మిర్యాలగూడ వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని, పట్టణాన్ని రహదారులతోపాటు, అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు మంత్రివర్యుల సహకారంతోపాటు, ఎంపీ ,ఇరిగేషన్ శాఖ మంత్రి తోడ్పాటు తీసుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈఎన్ సీ మధుసూదన్ రెడ్డి, క్యూబ్ హైవేస్ చైర్మన్ హరికృష్ణ రెడ్డి , మిర్యాలగూ డ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడారు. ఆర్ అండ్ బి ఎస్ ఈ సత్యనారా యణ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.