ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : క్రీడలలో గెలుపు, ఓటములు సహజమని,ఓటమి విజయానికి నాంది కావాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ఫూర్తినిచ్చారు.నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో గత 20 రోజులుగా నిర్వహిస్తున్న ఎన్ పి ఎల్ క్రికెట్ మ్యాచ్ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ,అందువల్ల ప్రతి ఒక్కరు బాగా కష్టపడి పని చేసి పైకి రావాలని పిలుపునిచ్చారు. ఎన్ జి కళాశాల మైదానాన్ని భవిష్యత్తులో అందరికీ అనుకూలంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
జిల్లా అభివృద్ధి లో భాగంగా ఎస్ఎల్ బిసీ కి 4000 కోట్ల రూపాయలను మంజూరు చేయించి టన్నెల్ తవ్వే మిషన్ బేరింగ్ ను అమెరికా నుండి తెప్పిస్తున్నామని, రెండు మూడు నెలల్లో బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు ద్వారా నీళ్లు నింపి నల్గొండ పట్టణం సమీపంలోని చర్లపల్లి వరకు మీరు ఇస్తామని తెలిపారు. ఎం జి యూనివర్సిటీలో రెండు కొత్త బ్లాక్ లు నిర్మిస్తున్నామని, ఐటి టవర్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, లతీఫ్ సాబ్ గుట్టను 107 కోట్ల రూపాయలతో టూరిజం కేంద్రంగా మార్చేందుకు టెండర్లు పిలవడం జరిగిందని, రాబోయే నాలుగేళ్లలో నల్గొండను బంగారు కొండగా చేస్తానని తెలిపారు.
నల్గొండ పట్టణంలో ప్రమాదాలను నివారించేందుకు, ట్రాఫిక్ జామ్ ను నియంత్రించేందుకు ఉద్దేశించి చేపట్టిన ఔటర్ రింగ్ రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు.ఈ సందర్భంగా ఆయన రన్నర్స్ విన్నర్స్ కు ట్రోఫీలను అందజేశారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన రక్తదాన శిబిరం లో 200 మంది రక్తాన్ని దానం చేసినట్లు మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూనే శారీరకంగా దృఢంగా ఉండాలని, ఆరోగ్యంతో పాటు ,చదువు పైన దృష్టి సారించాలని క్రీడాకారులతో కోరారు. గెలుపొందిన జట్లకు ఆమె అభినందనలు తెలిపారు.జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ క్రీడలు మనిషి జీవితంలో అతి ముఖ్యమని, ఓడినవారు, గెలిచినవారిని స్ఫూర్తిగా తీసుకొని ఆటలాడాలని పిలుపునిచ్చారు .జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా మిషన్ పరివర్తన తీసుకురావడం జరిగిందని, దీనికి అందరు సహకరించాలని కోరారు .అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మలమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.