మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది
ప్రజాదీవెన, నల్గొండ : రాష్ట్రంలోనే మొదటి సారిగా పైలెట్ పద్ధతిన గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉద్దేశించి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సోలార్ బ్యాటరీలతో రినివబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేసేందుకు నల్గొండ జిల్లా, కట్టంగూరు మండలం, ఐటి పాముల గ్రామానికి చెందిన 50 మంది స్వయం సహాయక సంఘాల మహిళలతో సోలార్ పవర్ బ్యాటరీలు ఏర్పాటు చేయిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
శుక్రవారం అయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో నల్గొండ జిల్లా, కట్టంగూరు మండలం, ఐటిపాములకు చెందిన 50 మంది స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ఇందిరా మహిళ స్వశక్తి కింద ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక్కొక్కరికి లక్ష రూపాయల విలువ చేసే సోలార్ బ్యాటరీల ఏర్పాటు కు 50 మందికి, 50 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని, దీనికోసం ప్రత్యేకించి మహిళలు పనిచేయాల్సిన అవసరం లేదని, వారి పని వారు చేసుకుంటూనే నెలకు అదనంగా ఆదాయం పొందవచ్చు.
అని అన్నారు. భూమి లేని నిరుపేదలు కుటుంబాలకు తోడుగా ఉండేందుకు నెలకు 3 నుండి 4 వేల రూపాయల ఆదాయం వచ్చే విధంగా స్వబ్యాగ్స్ ల్యాబ్ సహకారంతో సోలార్ బ్యాటరీ ఎనర్జీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమాన్నీ నల్గొండ జిల్లాలో చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమం ద్వారా కుటుంబాలకు చేదోడు, వాదోడుగా మహిళలు నిలుస్తారని, అంతేకాక ఆర్థికంగా బలపడతారని తెలిపారు. మహిళలు ఈ సోలార్ బ్యాటరీల ఏర్పాటు వల్ల ఎలాంటి అదనపు పని చేయాల్సిన అవసరం లేదని, వారి పని వారు చూసుకుంటూనే ఈ బ్యాటరీ ద్వారా ఆదాయం పొంద పొందవచ్చు అని తెలిపారు. స్వభాగ్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాళీ బ్యాటరీలను ఇంటిదగ్గర ఉంచి వెళ్ళడం జరుగుతుందని ,బ్యాటరీఛార్జింగ్ తో నిండిన తర్వాత వారే వచ్చి తీసుకువెళ్తారని, ఒక యూనిట్ పవర్ ను 16 రూపాయలకు స్వ బ్యాగ్స్ ల్యాబ్ కంపనినే తీసుకుంటుందని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
పైలెట్ పద్ధతిన ప్రారంభిస్తున్న ఈ ప్రాజక్టు విజయవంతం అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మహిళలు ముందుకు వచ్చి ఇలాంటివి ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం పొందడం ద్వారా కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలబడవచ్చని అన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభిస్తే భవిష్యత్తులో మహిళలు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని మంత్రి తెలిపారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలంగాణలో ఏ జిల్లాలో జరగని విధంగా ఈ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో చేపట్టడం జరిగిందని , ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఐటిపాములలో 50 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ ఎనర్జీ బ్యాటరీలను ఏర్పాటు చేసుకునేందుకు 50 లక్షల రూపాయల చెక్కులను ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఈ బ్యాటరీలను మహిళలు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందని, ఒక బ్యాటరీ కి 2000 లైఫ్ సైకిల్స్ ఉంటాయని, ఒకసారి బ్యాటరీ నిండితే 2000 సార్లు చార్జింగ్ చేసుకోవచ్చని, అందుకు సరిపడా పరికరాలను స్వబ్యాగ్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సరఫరా చేస్తారని తెలిపారు. బ్యాటరీ చార్జ్ అయిన తర్వాత కంపెనీ ప్రతినిధులు తీసుకువెళ్లి మల్లి చార్జింగ్ స్టేషన్ నుండి ఇంటి దగ్గరకు వచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీని ద్వారా నెలకు 3 నుండి 4000 రూపాయలు ఆదాయాన్ని మహిళలు పొందవచ్చు అని, ఈ ప్రాజెక్టును సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టులో సహకరించేందుకుగాను జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ ను, వ్యవసాయ శాఖ జేడిని నోడల్ అధికారులుగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.
స్వబ్యాగ్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సుధాకర్ మాట్లాడుతూ వాతావరణంలో మార్పులు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు నూతన విషయాలలో గ్రామీణ ప్రాంత రైతులు, మహిళలకు కొత్త విషయాలలో సేవలందించే విషయంపై 2021 లో స్వ బ్యాగ్స్ ల్యాబ్ స్టార్ట్ అప్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో మహిళలకు సాధికారత కల్పించే విధంగా సోలార్ బ్యాటరీ రినివబుల్ ఎనర్జీని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు .
సత్య సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జక్కుల సత్యనారాయణ మాట్లాడుతూ సోలార్ ఎనర్జీకి చాలా భవిష్యత్తు ఉందని ,2016లో సోలార్ ఎనర్జీ పై అంతా అవగాహన ఉండేది కాదని, ఇప్పుడు ప్రతి జిల్లాలో 50 వరకు సోలార్ ఎనర్జీ యూనిట్లు పనిచేస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ,జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్,ఆర్ డి ఓ అశోక్ రెడ్డి, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.