— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ పద్ధతిన అమలు చేయనున్న కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు సర్వేకై తక్షణమే బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి (Narayana Reddy) మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ ,సమాచార పౌరసంబంధాల శాఖ (Department of Revenue, Housing, Information and Civil Relations) మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారితో కలిసి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు, ఎల్ఆర్ఎస్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి జిల్లా అధికారులతో ఇదే అంశాలపై సమీక్ష నిర్వహించారు.
కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు (Digital card) విషయమై ప్రతి మున్సిపల్ వార్డు, గ్రామపంచాయతీ (Municipal Ward, Gram Panchayat)లలో 150 కుటుంబాలకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు .మంగళవారం రాత్రి 8 గంటల వరకే బృందాల వివరాలను ఇవ్వాలని, ఈనెల 2న ఈ బృందాలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపిక చేసిన సిబ్బంది అందరూ హాజరయ్యేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం వరకు ఈ బృందాలు క్షేత్రస్థాయిలో సర్వేను ప్రారంభించాలని చెప్పారు. ఇందుకుగాను మున్సిపల్ కమిషనర్లు వారి కార్యాలయాలలో కుటుంబ డిజిటల్ కార్డుకు సంబంధించి ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి ఆయా బృందాలలో ఉండే సిబ్బంది పేర్లు, వారి ఫోన్ నెంబర్లతో సహా పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు .రానున్న 15 రోజుల్లో పూర్తిస్థాయిలో కుటుంబ డిజిటల్ కార్డుకు సంబంధించిన పరిశీలన మొత్తం పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ,జిల్లా వ్యాప్తంగా ఈ అంశాన్ని ఆర్డీవోలు (rdo) సమన్వయం చేయాలనిఆదేశించారు .
డబుల్ బెడ్ రూమ్ (Double bedroom) ఇండ్లకు సంబంధించి ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల వారిగా వివరాలను సమర్పించాలని, కొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయ్యాయని, మరికొన్ని పురోగతిలో ఉన్నాయని, రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు దసరా నాటికి లబ్ధిదారులందరినీ గుర్తించి దసరాకు వాటిని లబ్ధిదారులకుఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్ ఆర్ ఏస్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. వానకాలం సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఈ నెల మూడున సమావేశం ఏర్పాటు చేయాలని, ఈ సమావేశానికి మిల్లర్లు, ఇతర సంబంధితులందరిని పిలవాలని చెప్పారు. గత ఆగస్టు 30 నుండి గత నెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు చేపట్టేందుకు తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు.
అంతకుముందు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)మాట్లాడుతూ కుటుంబ డిజిటల్ కార్డు పై జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేస్తూ ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లే ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కుటుంబ కార్డు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ,ఈ విషయంపై ఇటీవల కుటుంబ కార్డులు అమలు చేస్తున్న నాలుగు రాష్ట్రాలలో సీనియర్ అధికారులతో అధ్యయనం చేయించడం జరిగిందని, పైలెట్ పద్ధతిన అసెంబ్లీ నియోజకవర్గం నుండి పట్టణ ప్రాంతంలో 2, గ్రామీణ ప్రాంతంలో రెండు గ్రామాలను తీసుకొని ముందుగా సర్వే చేయడం జరుగుతుందని తెలిపారు .ఈ సర్వే సందర్భంగా కార్డులను ఎలా చేయాలి, వీటిని అమలు చేయడంలో ఏమైనా అడ్డంకులు ఎదురైనట్లయితే ఎలా పరిష్కరించాలని అధ్యయనం చేయడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి త్వరలోనే విధివిధానాలను జిల్లా కలెక్టర్ కు పంపించడం జరుగుతుందని తెలిపారు. కుటుంబ కార్డులకు సంబంధించి పాత పది జిల్లాలకు ఒక సీనియర్ అధికారిని రాష్ట్రస్థాయి నుండి నోడల్ అధికారిగా జిల్లాలకు నియమించడం జరుగుతుందని, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్డు తయారు చేసి ఇచ్చేలా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ జిల్లాల కలెక్టర్ల అభిప్రాయాలను సేకరించారు .
ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఏ ఒక్క ఇంటిని వదిలిపెట్టకూడదని ప్రతిఇల్లు ఒక కుటుంబ డిజిటల్ కార్డు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ ఆర్ ఎస్ పై రెవెన్యూ (revengue)శాఖమంత్రి మాట్లాడుతూ ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్లు సీరియస్ గా తీసుకోవాలని, నిజంగా అర్హత ఉన్న వాటాన్నిటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
డబుల్ బెడ్ రూమ్ (Double bedroom) ఇండ్లకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 64,000 ఇండ్లు పూర్తయ్యాయని ,కొన్ని పూర్తయ్యె దశలో ఉన్నాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు దసరా కంటే ముందే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులను గుర్తించి దసరా కానుకగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులను గుర్తించి నివేదిక తయారు చేసి పంపించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి సన్నధాన్యానికి ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తుందని చెప్పారు. మండలానికి ఒక దాన్యం కొనుగో లు కేంద్రాన్ని ముందు ప్రారంభిం చాలని, అవసరాన్ని బట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని చెప్పారు. కాగా 375 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణ చంద్ర ,అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.