–రెవెన్యూ చట్టంలో తప్పొప్పుల ను సవరిస్తున్నాం
— రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి
Pongileti Srinivas Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ర్టంలో ప్రస్తుతం ఉన్న రెవిన్యూ చట్టంలో (Revenue Act)మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ (ఆర్ ఓ ఆర్ ) చట్టాన్ని తీసుకురానున్నామని రాష్ట్ర రెవె న్యూ, సమాచార పౌర సంబం ధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Pongileti Srinivas Reddy)అన్నారు. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో తప్పొప్పులను సవరించి ,అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించి నూతన చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఉద్దేశించి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం, నెల్లికల్ గ్రామంలో నిర్వహించిన రైతుల ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి శనివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తెచ్చిన 2020 రెవెన్యూ చట్టం,ధరణి వల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని,, 2020 చట్టాన్ని అలాగే ధరణిలోని (darani) తప్పొప్పులను సవరించేందుకు దేశంలోని అన్ని రెవెన్యూ చట్టాలను పరిశీలించి మేలైన చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సేకరించి పబ్లిక్ డొమైన్ లో ఉంచినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు (A pilot project) కింద ఎంపిక చేయడం జరిగిందని ,నూతన రెవెన్యూ చట్టంపై ప్రజల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే చట్టం తీసుకురావాలని ,అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీల సూచనలు సైతం పరిగణలోకి తీసుకొని అతి కొద్ది రోజుల్లోనే నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకురాబోతున్నామని మంత్రి వెల్లడించారు. అర్హులైన పేదవారికి.
ప్రభుత్వ భూములు (Government lands) అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని ,ప్రత్యేకించి తిరుమలగిరి సాగర్ లో కొంతమంది పొజిషన్లో ఉన్నప్పటికి పట్టాలు లేవని, పట్టాలున్న వారికి భూమిలేదని, అలాగే ఎవాక్యూవేషన్ ప్రాపర్టీ కి సంబంధించి, ఇతర ప్రభుత్వ భూములకు సంబంధించిన చేస్తున్న సర్వే పూర్తయిన తర్వాత సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. తిరుమలగిరి సాగర్లో సుమారు 13 వేల ఎకరాల కు బోగస్ పట్టా పాస్ పుస్తకాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చారని, ప్రభుత్వం పేదలకు మంచి చేయాలన్నదే తపన అని, ప్రభుత్వాస్తులన్నీ పేదవాడికి చెందాలని, పేదవాడికి చెందేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని చెప్పారు. తిరుమలగిరి సాగర్ లోని 3500 నుండి 4 వేల ఎకరాలు అర్హులైన పేదవారికి పట్టాలు ఇవ్వాల్సి ఉందని, డిసెంబర్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రిని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి తీసుకువచ్చి ఇక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేసి నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతామని మంత్రి వెల్లడించారు.
గతంలో చెప్పినట్లుగానే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు (Indiramma houses) ఇస్తామని, నెలాఖరులోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు మొదటి విడతన 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని , నాగార్జునసాగర్ నియోజకవర్గానికి 5000 ఇండ్లు ఇస్తామని మంత్రి ప్రకటించారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి సర్టిఫికెట్లు లేక బ్యాంకులో మార్ట్గేజ్ లో ఉన్న వాటిని ఆ మార్ట్ గేజ్ అప్పు నిలిపివేసి లబ్ధిదారులకే ఆ ఇండ్లు సొంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.అలాగే గతంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై గృహనిర్మాణ శాఖలో ఉన్న హక్కు పత్రాలు పెండింగ్ (pending)లో ఉన్నాయని, ఆ పెండింగ్ ను క్లియర్ చేసి లబ్ధిదారులందరికీ ఆ హక్కు పత్రాలు ఇచ్చేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి (Kunduru Janareddy) మాట్లాడుతూ ధరణితో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ధరణిలోని తప్పులను, పాత చట్టంలోని తప్పులను సరి చేసేందుకు తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం సంతోషమని, గత రెండు నెలలుగా రెవెన్యూ అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారని, తిరుమలగిరి సాగర్ లోని భూముల సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. ఫారెస్ట్ భూములకు సంబంధించి సంయుక్త తనిఖీలు నిర్వహించి , ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు ఇవ్వాలని, అలాగే రిహాబిలిటేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (Battula Lakshmareddy)మాట్లాడుతూ అడవిదేవులపల్లి, దామరచర్ల మండలాల్లో సైతం గతంలో పట్టాలు ఇచ్చినప్పటికి ధరణిలో నమోదు కాక రుణమాఫీ వంటివి రైతులకు రాలేదని, అందువల్ల తిరుమల గిరి సాగర్ మాదిరిగానే అడవిదేవులపల్లి, దామరచర్ల మండలాలలో సైతం సర్వే నిర్వహించాలని కోరారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఫారెస్ట్ భూములు సాగు చేసుకుంటున్న రైతులను గుర్తించి పట్టాలి ఇవ్వాలని, కొన్నిచోట్ల రైతులు అటవీ భూముల్లో సేద్యం చేసుకుంటున్నచోట అధికారులు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. నాగార్జునసాగర్ శాసనసభ్యులు జయవీర్ మాట్లాడుతూ తిరుమలగిరి సాగర్ తో పాటు ,రాష్ట్రవ్యాప్తంగా ధరణి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి సాగర్ ని ఎంపిక చేయడం జరిగిందని, దీంతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.
ముఖాముఖికి హాజరైన నెల్లికల్ గ్రామానికి చెందిన రైతు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ధరణిలో పదేళ్లుగా జరగనిది నూతన ప్రభుత్వం తీసుకురానున్న కొత్త చట్టం వల్ల రెండు నెలల్లో జరిగనుందని, ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
మరో రైతు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో రెవెన్యూ, ఫారెస్ట్ పట్టాలతో సమస్యలు ఉండేవని, ఇప్పుడు ఈ సమస్యలు పరిష్కారం అవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
పెద్ద చెరువు తండాకు చెందిన రైతు రమేష్ మాట్లాడుతూ 60, 70 ఏళ్లుగా తమ భూముల సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని ,నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు న్యాయం జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. భూములను రెవిన్యూ, ఫారెస్ట్ భూములుగా గుర్తించి హద్దులు నిర్ణయించాలని, సాదా బైనమా సమస్యలను కూడా పరిష్కరించాలని, 424 సర్వే నెంబర్లు ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించాలని, గుర్తించిన భూములకు పట్టాలతో పాటు, రైతుబంధు, రైతు బీమా ఇవ్వాలని కోరారు.
మరో రైతు పుణ్యా నాయక్ మాట్లాడుతూ పాత చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా తమ మండలంలో సర్వే చేసి దాదాపు 90% సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేసిందని, ఇందుకు ధన్యవాదాలు తెలియజేశారు. భూమి మీద ఉన్న వారికే పట్టాలు ఇచ్చేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. రైతు ముని నాయక్ మాట్లాడుతూ భూ సమస్యలు ఎక్కువగా కృష్ణ పట్టి,తిరుమలగిరి సాగర్ లోనే ఉన్నాయని, గతంలో పట్టాలు ఇచ్చినప్పటికీ ధరణి తర్వాత అవి కనిపించడం లేదని, ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు .మేదరి ఎల్లమ్మ మాట్లాడుతూ గతంలో తమ భూములకు పట్టాలు లేక చాలా ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు పట్టాలు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తిరుమలగిరి సాగర్ లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన, నూతన చట్టం కింద నిర్వహించిన సర్వే వివరాలను ,భూముల వివరాలను తెలియజేస్తూ మండలం మొత్తంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని , 8 గ్రామాలలో భూ సమస్యలు ఉండగా, పట్టాల భూములలో సైతం సమస్యలు ఉన్నాయని, 8597 ఎకరాలు ప్రభుత్వ భూమి ,3400 ఎకరాలు ఫారెస్ట్ భూమి ఉందని, మొత్తం 16600 ఎకరాలు రెండు నెలల్లో సర్వే చేయడం జరిగిందని, గ్రామసభలు నిర్వహించి ప్రతి సర్వే నంబర్లో ఎంజాయ్ మెంట్ సర్వే నిర్వహించి తర్వాత గ్రామపంచాయతీలో జాబితాను ప్రదర్శించి వాటిపై ఏదైనా అభ్యంతరాలు వస్తే పరిష్కరించడం జరిగిందని, మిస్సింగ్ సర్వే నంబర్లను స్పష్టంగా రాయడం జరిగిందని తెలిపారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కర్ణటి లింగారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.