Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sarkar Davakhana Medical: ప్రభుత్వాసుపత్రిలో జడ్జి ప్రసవం

నల్లగొండ జిల్లా నిడమనూరు కోర్టులో విధులు
సర్కార్ దావఖానలో కాన్పుచేసుకోవడంతో ప్రశంసలు

Sarkar Davakhana Medical: ప్రజాదీవెన, నల్లగొండ బ్యూరో: సర్కార్ దవఖాన వైద్యం (Sarkar Davakhana Medical) అంటే చాలామందికి ఇప్పటికీ చిన్న చూపే..! అక్కడ అరకొర వైద్య సౌకర్యాలు ఉంటాయని, వైద్యులు సరిగా పట్టించుకోరని అపవాదు ఉంది. అయితే, ఉన్నత స్థాయి అధికారులు ప్రభుత్వంపై నమ్మకం పెంచేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రజా వైద్యం, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేందుకు కృషి చేస్తునే ఉన్నారు. తాజాగా, ఓ న్యాయమూర్తి ప్రసవం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తి టి.స్వప్న ఆదివారం(ఆగస్ట్18) రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో (Kothagudem Government Hospital) ప్రసవించారు.

కొత్తగూడెంలోని బూడిదగడ్డ బస్తీకి చెందిన న్యాయవాది శాంత కుమార్తె అయిన స్వప్నకు మిర్యాలగూడ మండలం నిడమనూరుకు చెందిన దాసరి కార్తీక్ తో వివాహం జరిగింది. ప్రస్తుతం స్వప్న, నల్లగొండ జిల్లా మున్సిఫ్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల ప్రసవం కోసం స్వప్న కొత్తగూడెంలోని (Kothagudem ) పుట్టింటికి వచ్చారు. ఉన్నత విద్యనభ్యసించి, న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఆమె ప్రభుత్వ ఆసుపత్రి పట్ల మక్కువ చూపారు. కార్పొరేట్ స్థాయి వైద్యం చేయించుకునే స్థోమత ఉన్నా సామాన్య ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రభుత్వ ఆస్పత్రిలో (Government Hospital)) ప్రసవించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని రామవరం మాతాశిశు సంరక్షణ కేంద్రంలో చేరారు. ఆదివారం రాత్రి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వైద్య బృందం సురక్షితంగా ప్రసవం కావడానికి అన్ని చర్యలు తీసుకోవడంతో సేఫ్‌గా డెలివరీ అయ్యారు. తల్లీ కూతురు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా తనకు వైద్య సేవలందించిన డాక్టర్ సాగరిక, సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగూడెంలోని రామవరం మాతా శిశు కేంద్రం ఒక తల్లి లాంటిదని, ప్రతి ఒక్క గర్భిణీకి డెలివరీ చేయడం వాళ్ళ క్షేమమే మా ప్రధాన ధ్యేయమని డాక్టర్ సరళ తెలిపారు. ఎటువంటి అపోహలు చెందవద్దని, నిర్భయంగా ప్రభుత్వ ఆసుపత్రుల చేరి తల్లి బిడ్డ ఇంటికి క్షేమంగా వెళ్ళడమే అని అన్నారు. జడ్జి స్వప్న తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు అభినందిస్తున్నారు.