Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sarath Chandra Pawar: జిల్లాలో గ్రూప్- II రాత పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

ప్రజదీవెన, నల్గొండ టౌన్ : ఈ నెల 15 వ తేది (ఆదివారం), 16 వ తేది (సోమవారం) రెండు రోజులు పాటు జరిగే గ్రూప్-II రాత పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ అన్ని రకాల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి ఒక ప్రకటనలో తెలిపారు.నల్గొండ జిల్లాలో గ్రూప్-2 పరీక్షలకు 29118 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, ఇందుకుగాను నల్గొండ లో 59, మిర్యాలగూడ పట్టణంలో 28, మొత్తం 87 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నల్గొండ నుండి 21,777 మంది అభ్యర్థులు, మిర్యాలగూడ నుండి 7941 మంది మొత్తం 29118 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు.

ఈ పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు 163 బి.ఎన్.యస్.యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, మరియు చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు, మూసి వేయాలని, మరియు పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దు అని మరియు పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ నందు పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని అన్నారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్ లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు,వంటివి తీసుకువెళ్లడానికి అనుమతి ఉండదని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లేముందే ప్రధాన గేట్ వద్ద తనిఖీలు నిర్వహించే పోలీసు వారికి సహకరించగలరని పేర్కొన్నారు.