జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోలీసు రిక్రూట్మెంట్ నందు ఉద్యోగం పొంది 9 నెలల శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు వచ్చిన 290 మంది నూతన సివిల్ కానిస్టేబుల్స్ కు పోలీసు స్టేషన్ల వారీగా విధుల నియామక పత్రాలను అందించారు. నియామక పత్రాలు పొందిన నూతన కానిస్టేబుల్ లకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ సమాజంలో పోలీసు విధులు అనేవి చాలా ప్రత్యేకమైనవి, విధుల నిర్వర్తించే సమయంలో సమాజం దృష్టి పోలీసు పై ఉంటుంది కావున చక్కని యూనిఫాం లో క్రమశిక్షణతో, బాధ్యతగా తమకు అప్పగించిన విధులు నిర్వర్తించాలని అన్నారు.
వివిధ సమస్యలతో పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితులకు క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి న్యాయం జరిగే విధంగా ధైర్యం, భరోసా కల్పించి పోలీస్ శాఖ ప్రతిష్ఠను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను వృత్తి రీత్యా అమలుపరుస్తూ, క్రమశిక్షణతో ఉంటూ విధులు నిర్వర్తించాలి, సమయానికి విధులకు చేరుకోవాలి, ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
ఎలాంటి విధులైనా నిర్వర్తించే విధంగా మానసిక దృఢత్వంతో, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలి అన్నారు. విధులతో పాటుగా మీ యొక్క ఆరోగ్యం కాపాడుకోవాలని ప్రతి రోజూ వ్యాయామం,క్రీడలు లాంటి వాటిని దినచర్యలో ఒక భాగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం నందు అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఏ ఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్ఐలు సంతోష్, శ్రీను,సిబ్బంది పాల్గొన్నారు.