Tripathi : ప్రజాదీవెన, నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యం కాని భూముల పరిశీలనను పక్కగా చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయ, రెవిన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా, చిట్యాల మండలం ,వెలిమినేడులో వ్యవసాయ ,రెవెన్యూ అధికారుల బృందాలు నిర్వహిస్తున్న రైతు భరోసా క్షేత్రస్థాయి పరిశీలనను ఆకస్మికంగా తనిఖీ చేశారు.రైతు భరోసా పథకం కింద భూభారతి ద్వారా డౌన్లోడ్ చేసుకున్న భూముల వివరాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాటిస్తున్న నియమ, నిబంధనలను ఆమె వ్యవసాయ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు .
అంతేకాక భూభారతిలోని జాబితా ద్వారా వెలిమినేడు గ్రామంలో గుర్తించిన వ్యవసాయేతర భూములైన నాలా లే-ఔట్లు, ఫ్యాక్టరీలు, ఇండ్లు, మైనింగ్, రాళ్లు రప్పలు, కొండలు, గుట్టలు ఉన్న భూములు, తదితర భూముల వివరాలను నమోదు చేస్తున్నది లేనిది పరిశీలించారు .ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఈ బాధ్యత మండల స్థాయిలో వ్యవసాయ , రెవిన్యూ అధికారులపై ఆధారపడి ఉందని ,వ్యవసాయ యోగ్యం కానీ భూముల జాబితాను మరోసారి పరిశీలించి పక్కగా జాబితా రూపొందించాలని ఆమె ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ చిట్యాల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి పోర్టల్ లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించడమే కాకుండా, కార్యాలయానికి భూ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.ధరణిలో పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆమె చెప్పారు.జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, మండల వ్యవసాయ అధికారి, తహసిల్దార్ కృష్ణ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.