ప్రజాదీవెన, నల్గొండ బ్యూరో : ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని హడావిడిగా కాకుండా, జాగ్రత్తగా చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సర్వే బృందాలను ఆదేశించారు.బుధవారం ఆమె నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండలం గుర్రపు తండా గ్రామ పంచాయతీ పరిధి లోని దర్గా తాండ లో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన ను తనిఖీ చేశారు. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారు ఫోటోతో సహా, ఇల్లు మొత్తం కవర్ అయ్యే విధంగా ఫోటోలు తీయాలని చెప్పారు.ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుని ఉండి వలస వెళ్లిన వారికి ఫోన్ లేదా ఇతర మార్గాల ద్వారా సర్వే సమాచారం తెలియజేసి తక్షణమే గ్రామానికి వచ్చి వివరాలను ఇచ్చే విధంగా సమాచారం అందించాలని చెప్పారు.
ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న గ్యారంటీలకు ఎవరైనా గతంలో దరఖాస్తు చేసుకోనట్లయితే ప్రస్తుతం ఎం పి డి ఓ కార్యాలయాలాలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన మీ- సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. సర్వే సందర్భంగా పూర్తి వివరాలను అప్లోడ్ చేయాలని, ఎవరైనా దరఖాస్తు దారు అందుబాటులో లేనట్లయితే పాక్షికంగా అప్లోడ్ చేసి, అనంతరం ఎట్టి పరిస్థితులలో ఆ వివరాలు, అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని చెప్పారు .దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి,గృహ నిర్మాణ శాఖ పి డి రాజ్ కుమార్, కొండమల్లేపల్లి ఎంపీడీవో బాలరాజు రెడ్డి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.