ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో ప్రజావాణి ఫిర్యాదులపై ఆమె సమీక్షించారు. రెవిన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్ , వ్యవసాయ తదితర శాఖల వద్ద ఫిర్యాదులు ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని, ఈ శాఖల అధికారులు ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పరిష్కరించాలని చెప్పారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, ముఖ్యంగా ఫిర్యాదుల పరిష్కారం వేగంగా ఉండాలని అన్నారు. వచ్చే వారం నాటికి అన్ని శాఖలు సాధ్యమైనంత ఎక్కువ ఫిర్యాదులను పరిష్కరించాలని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలలో భాగంగా అన్ని నియోజకవర్గాలలో క్రిస్మస్ వేడుకల సందర్బంగా విందు ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించి ఆర్డీవోలు, తహసిల్దారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇస్తే ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాల్లో తీసుకోవాలని, గతంలో దరఖాస్తు చేసుకున్న వారు తిరిగి దరఖాస్తు చేసుకోకూడదని ఆమె కోరారు.
కాగా ఈ సోమవారం (50) మంది ఫిర్యాదు దారులు వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ కు సమర్పించారు.ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ అమరేందర్, జెడ్పిసిఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు.