ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : తెలంగాణ పౌరులుగా మన ఘనమైన చరిత్రను మనం తెలుసుకొని ఆ విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా గురువారం ఎన్. జి. కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలోని యువ టూరిజం సభ్యులు నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఛాయా సోమేశ్వరాలయం, ఉదయ సముద్రం, పచ్చల సోమేశ్వరాలయం, పానగల్ మ్యూజియం, లతీఫ్ సాహెబ్ దర్గాను సందర్శి౦చారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర, వారసత్వం ఎంతో గొప్పదని నేటి తరం విద్యార్థులు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. ముందుగా మన స్థానిక చరిత్రను, సాంస్కృతిక వికాసాన్ని తెలుసుకున్నప్పుడే రాష్ట్ర, దేశ ఔన్నత్యం తెలుస్తాయని అన్నారు. మన భౌగోళిక, చారిత్రిక స్థితిగతులు తెలుసుకోవడంలో భాగంగా స్థానిక దర్శనీయ స్థలాలను, చారిత్రక ప్రదేశాలను, పర్యాటక ప్రాంతాలను దర్శించాలని సూచించారు. యువ టూరిజం క్లబ్ సభ్యులకు జిల్లా కేంద్రంలోని పలు చారిత్రిక, సాంస్కృతిక ప్రదేశాలను చూపించిన కళాశాల చరిత్ర విభాగాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో చరిత్ర విభాగం అధ్యాపకులు మరియు యువ టూరిజం సమన్వయకర్త నర్సింగు కోటయ్య, అధ్యాపకులు డా. అంకుస్, యువ టూరిజం సభ్యులు పాల్గొన్నారు.