ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భక్తితో సాధించని దంటూ ఏమీ లేదని తీతీదే ఆల్వార్ దివ్య ప్రబందు ప్రాజెక్టు పరిశీలకులు వింజమూరు విజయ్ కుమార్ ఆచార్య అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం లోని హైదరాబాదు రోడ్డులో ఉన్న చంద్రగిరి విలాస్ కాలనీలోని శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ధనుర్మాసంలో భక్తులు విష్ణు సహస్ర నామాల తో పాటుగా తిరుప్పావై పాశురాలను పఠించేందుకూ ప్రాధాన్యత ఉంటుందన్నారు. గోదాదేవి స్వయంగా రచించిన ఈ పాశురాలు తమిళంలో ఉంటాయని తెలిపారు.
ఎక్కువగా మంచి అలవాట్లతో జీవించమనీ, తోటివారికి సాయపడమనీ, భగవంతుణ్ని ఆరాధించమనీ సూచిస్తాయని పేర్కొన్నారు. మొదటి అయిదు పాశురాలు తిరుప్పావై ముఖ్యోద్దేశాన్ని తెలియజేస్తే.. ఆ తరువాత పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఎక్కువగా కనిపిస్తాయన్నారు. చివరి పాశురంలో గోదాదేవి తన గురించి తెలియజేస్తూ… తాను విష్ణుచిత్తుని కుమార్తెననీ ఈ ముప్పై పాశురాలనూ తాను రచించి పాడాననీ చెబుతూనే ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ముక్తాయిస్తుందని తెలిపారు. అనంతరం కాలనీ కమిటీ సభ్యులు తీతీదే పరిశీలకిడిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుప్పావై ప్రవచకులు సంపన్ ముడుంబై పవన్ కుమార్ ఆచార్య, అర్చకులు వేదాంతం నరసింహచార్యులు, చక్రి, కాలనీ అధ్యక్షుడు వేముల సాయికుమార్, వివిధ కాలనీలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.