ఓం బిర్లా దృష్టికి థర్డ్ డిగ్రీ అంశం
ప్రజా దీవెన/ న్యూ ఢిల్లీ: రాష్ట్రంలో కలకలం రేపిన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. ఎల్బీనగర్ పీఎస్‌లో మహిళపై జరిగిన థర్డ్ డిగ్రీ ఘటనను గిరిజన సంఘాల నేతలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లారు.
శనివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మీర్ పేట్ కార్పొరేటర్ నీల రవి నాయక్ కలిశారు. మహిళపై పోలీసులు ప్రయోగించిన థర్డ్ డిగ్రీ అంశాన్ని స్పీకర్‌కు గిరిజన సంఘాల నేతలు వివరించారు.
ఒక మహిళను ఇంతలా కొట్టడం ఏంటని స్పీకర్ అడిగినట్టు గిరిజన నేతలు చెప్పారు. పోలీసులు మహిళలపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడం బాధాకరమని స్పీకర్ వ్యాఖ్యానించారని తెలిపారు.మాజీ మంత్రి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ తెలంగాణలో శాంతి భద్రతలు లేవన్నారు.
అగ్రవర్ణాలకు ఒక న్యాయం, బడుగులకు ఒకరకమైన న్యాయం దక్కుతోందన్నారు. బీఆర్ఎస్ నేతల ఇండ్లలో మహిళలపై ఇలాగే అత్యాచారాలు జరిగితే నష్టపరిహారం తీసుకొని వదిలేస్తారా అని ప్రశ్నించారు. గిరిజనుల మాన, ప్రాణాలకు కేసీఆర్ ప్రభుత్వం వెలకట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.గిరిజన మహిళ వరలక్ష్మికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.