Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ahmedabad Tragedy: అహ్మదాబాద్ దుర్ఘటనపై అత్యున్నతస్థాయి కమిటీ

–సమగ్ర దర్యాప్తుకు కేంద్రం నిర్ణయం
–ఘటనకు దారితీసిన మూల కారణాలు వెలికితీయడమే లక్ష్యం
–ఏఏఐబీ సీనియర్ అధికారులు, ఆయా ఏజెన్సీల ప్రతినిధులు సభ్యులు
–పౌర విమానయాన శాఖ‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు వెల్లడి

Ahmedabad Tragedy: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన అహ్మదాబాద్‌ దుర్ఘటనపై అత్యున్నతస్థాయి కమిటీ నేతృత్వంలో సమగ్ర దర్యాప్తు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా ఏఐ-171 విమాన ప్రమాదం ఈ ఘోర దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు భార త ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, మూల కారణాలను వెలికితీయడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా ఈ కమిటీ పని చేయనుంది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)కు చెందిన సీనియర్ అధికారులతో పాటు ఇతర సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రమాద కారణాలను నిగ్గుతేల్చేందుకు వీరు అంతర్జాతీయ సంస్థల నిపుణులతో కలిసి పనిచేయనున్నారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో పౌర విమానయాన శాఖ‌ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు వెల్ల‌డించారు.

ఈ ప్ర‌మాదాన్ని తాము తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నామ‌న్నారు. త‌న తండ్రి కూడా రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించార‌ని, అలాగే విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల బాధ త‌న‌కు తెలుసన్నారు. భ‌విష్య‌త్ లో ఇటువంటి ప్ర‌మాదాల జ‌ర‌గ‌కుండా చూస్తామ‌న్నారు. దీని కోసం అనుభ‌వ‌జ్ఞులైన వారితో ఒక స‌ల‌హా క‌మిటీని ఏర్పాటు చేస్తున్నా మ‌న్నారు. త‌మ‌కు ప్ర‌యాణీకుల భ‌ద్ర‌తే తొలి ప్రాధాన్యమని, అందుకే ప్ర‌స్తుతం నిర్వ‌హ‌ణ‌లో ఉన్న అన్ని విమానాల స్థితిగ‌తుల‌పై స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాలని అన్ని విమానయాన సంస్థ‌ల‌ను కోరామ‌న్నారు.

విమాన ప్ర‌మాద వివ‌రాల‌ను బ్లాక్ బాక్స్ డేటా విశ్లేష‌ణ త‌ర్వాత క్లియ‌ర్ గా తెలుస్తాయ‌న్నారు. ఇక కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే ఉన్నత స్థాయి కమిటీ రాబోయే కొద్ది వారాల్లో ప్రాథమిక వాస్తవ నివేదికను సమర్పించే అవకాశం ఉందని, ఈ దర్యాప్తు ద్వారా వెలుగులోకి వచ్చే అంశాలు భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి దోహదపడతాయన్నారు.

కాగా దర్యాప్తు బృందాలు ఇప్పటికే విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్స్లను ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో ఒకటి స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, దాని నుంచి సమాచారాన్ని సేకరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. విమానం కూలిపోవడానికి ముందు జరిగిన సంఘటనల క్రమాన్ని అర్థం చేసుకోవడంలో ఈ ఫ్లైట్ రికార్డర్ల నుంచి లభించే సమాచారం అత్యంత కీలకమని భావిస్తున్నారు. సాంకేతిక లోపం, విమానం రెక్కల ఫ్లాప్ సెట్టింగ్‌ లు లేదా డేటా ఇన్‌పుట్‌లో పొరపాట్లు, వాతావరణ పరిస్థితుల ప్రభావం వంటి అనేక కోణాల్లో దర్యాప్తు అధికారులు దృష్టి సారించారన్నారు.

ఇక‌ ఈ దర్యాప్తు ప్రక్రియలో అంతర్జాతీయ సహకారం కీలక పాత్ర పోషిస్తోందని, అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్‌టీఎస్‌బీ) నిపుణులు ఇప్పటికే భారత అధికారులతో కలిసి ఆధారాలను పరిశీలించేందుకు సిద్ధమయ్యారని, అలాగే అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం, కెనడాకు చెందిన ట్రాన్స్‌పోర్టేషన్ సే ఫ్టీ బోర్డ్ (టీఎస్‌బీ) కూడా ఒక నిపుణుడిని ఈ దర్యాప్తు పురోగతిని పర్యవేక్షించేందుకు నియమించిందని వెల్లడించారు.