–బచత్ పత్రాపై రాజధాని ప్రజలకు వివరణ
–ప్రతి కుటుంబంలో రూ.25వేలు సేవ్
–మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : ప్రజాదీవెన, ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఎన్నో హామీలు ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ “బచత్ పత్రా” పేరిట ఓ ప్రచారాన్ని ప్రారంభించింది. దీనిపై ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఢిల్లీలో అందిస్తున్న పథకాల వల్ల ప్రతి కుటుంబం నెలకి రూ.25,000 ఆదా చేసుకుందని చెప్పారు. “బచత్ పత్రా” పేరిట శుక్రవారం ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా తమ పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి బచత్ పత్రా (సేవింగ్స్‌కు సంబంధించిన అప్లికేషన్)ను ఇచ్చి దాన్ని నింపమంటారని తెలిపారు.
ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి వారితో పాటు కూర్చొని ఆప్ పథకాల వల్ల వాళ్లు ఎంతగా ప్రయోజనం పొందారో వివరిస్తారని చెప్పారు. “ఆప్ సర్కారు పథకాల వల్ల ఢిల్లీలోని ప్రతి కుటుంబం నెలకు 25,000 రూపాయల వరకు ఆదా చేసింది. బీజేపీ మాత్రం ప్రభుత్వ నిధులను దోచుకోవడానికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది” అని అన్నారు. తమ పార్టీ ఢిల్లీలో మరోసారి అధికారంలోకి వస్తే ఢిల్లీ ప్రజలు అదనంగా మరో రూ.10,000 ఆదా చేసుకుంటారని చెప్పారు. ఆప్ మ్యానిఫెస్టోలో ఎన్నో పథకాలు ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటివి ఉన్నాయని చెప్పారు. ఫిబ్రవరి 1న కేంద్ర సర్కారు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండడంతో దీనిపై ఆయన విమర్శలు గుప్పించారు.
బడ్జెట్లు సాధారణంగా ద్రవ్యోల్బణానికి కారణమవుతున్నాయని, కుటుంబాలపై ఆర్థిక ప్రభావాన్ని చూపుతున్నాయని కేజ్రీవాల్ తెలిపారు. అయితే, ఢిల్లీలో మాత్రం తమ ప్రభుత్వం ప్రతి కుటుంబం పొదుపు చేసుకునేలా నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. బీజేపీ మాత్రం అధికారంలోకి వస్తే ఆప్ అందిస్తున్న వాటిని నిలిపివేస్తామని తరుచూ చెబుతోందని తెలిపారు.