–అలకానంద ఉగ్రరూపంతో నిర్ణయం
–భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడే అవకాశం
Char Dham Yatra: ప్రజాదీవెన, ఉత్తరాఖండ్: భారీవర్షాల కారణంగా ఛార్‌థామ్ యాత్రకు (Char Dham Yatra) తాత్కాలిక బ్రేక్ పడింది. ఛార్‌థామ్ యాత్రను నిలిపివేస్తునట్టు ఉత్తరాఖండ్ (Uttarakhand) ప్రభుత్వం ప్రకటించింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని డెహ్రాడూన్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బద్రీనాథ్ , కేదార్‌రాథ్ , యమునోత్రి (Badrinath, Kedarrath, Yamunotri) మార్గాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఛార్‌ధామ్ యాత్రికులు తమ ప్రయాణాలను మానుకోవాలని అధికారులు సూచించారు.
ఇప్పటికే బద్రీనాథ్ హైవేను (Badrinath Highway) మూసేశారు. కొండచరియలు విరిగిపడడంతో మూసేశారు. చాలా చోట్ల రోడ్లకు గుంతలు ఏర్పడ్డాయి. జోషిమఠ్ లోని విష్ణుప్రయాగ్ దగ్గర అలకానంద ఉగ్రరూపాన్ని దాల్చింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీవర్షాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఉత్తరాఖండ్ లోని తొమ్మిది జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌అలర్ట్ జారీ చేసింది. గర్వాల్ (Garhwal)ప్రాంతంలో రెండు రోజుల పాటు అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. రాంనగర్‌లో చాలా వంతెనలు ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి సూచించారు. వాతావరణం అనుకూలించిన తరువాతే ఛార్‌ధామ్ యాత్ర (Chardham trip) తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రతి ఏటా లక్షలాదిమంది భక్తులు ఛార్‌ధామ్ యాత్రకు వస్తుంటారు. ఈసారి కూడా ఇప్పటికే చాలా మంది దివ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు.