Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chirag -Athawale: వర్గీకరణ పై ఎన్డీఏలో విభేదాలు

–సుప్రీంకోర్టు తీర్పుపై మండిపడిన కూటమిలోని పలు పార్టీ నేతలు
–తీర్పుపై అప్పీల్‌ చేస్తామన్న కేంద్ర మంత్రులు చిరాగ్‌, అథవాలే

Chirag -Athawale:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీ కరణకు (Classification of SC)అనుకూలంగా ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఎన్డీయే కూటమి పక్షాలైన లోక్‌ జనశక్తి పార్టీ(రాంవిలాస్‌), రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ– అథవాలే) తీవ్రంగా వ్యతిరేకించా యి. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని లోక్‌ జనశక్తి పార్టీ చీఫ్‌, కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ తెలిపారు.

అదేవిధంగా రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (Republican Party of India) అధినేత రామ్‌దాస్‌ అథవాలే కూడా తీర్పును వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీలేయర్‌ క్రిటేరియాపై అప్పీలు చేస్తామన్నారు. ‘‘15% ఎస్సీ కోటాలో వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్షించాలని కోరుతున్నాం. దీనిపై అప్పీల్‌కు వెళ్తాం’’ అని చిరాగ్‌ పాశ్వాన్‌ చెప్పారు. అస్పృశ్యత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు విఫలమైందని వ్యాఖ్యానించారు. ‘‘ఎస్సీ కోటాలో క్రీమీలేయర్‌ను ఎట్టిపరిస్థితిలోనూ అనుమతించలేం. వర్గీకరణ ద్వారా ఎస్సీలు అనుభవిస్తున్న అస్పృశ్యత పరిష్కారం కాదు’’ అని అన్నారు.

అంతేకాదు, ఎస్సీల్లోని (st) ఉన్నత విద్యావంతులు, ఆర్థికంగా బలంగా ఉన్నవారు కూడా అస్పృశ్యతను ఎదుర్కొంటున్నారని పాశ్వాన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో వర్గీకరణ మరింత అన్యాయానికి గురిచేసినట్టే అవుతుందన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కోరుతున్న కుల గణనకు పాశ్వాన్‌ మద్దతు తెలిపారు. అయితే, ఆయా కులగణన వివరాలను మాత్రం బహిరంగ పరచకూడదని అభిప్రాయపడ్డారు. కాగా, తమ మిత్రపక్షం జేడీయూ సుప్రీంకోర్టు తీర్పును సమర్థించడంపై మాత్రం పాశ్వాన్‌ మౌనం వహించారు. మరోవైపు, ఆర్‌పీఐ అధినేత, కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే కూడా సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కులం ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఏర్పాటు చేశారని, దీనిలో క్రీమీలేయర్‌ క్రిటేరియా వర్తింపచేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, దీనిపై అప్పీలుకు వెళ్తామని అన్నారు.