ప్రజా దీవెన, వరంగల్
Car Falls Into SSR Canal: ఎస్సారెస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కుమారుడు మృతి చెందగా తండ్రి, కుమార్తె గల్లంతయ్యారు. కాల్వలో కొట్టుకుపోతున్న తల్లిని స్థానికులు కాపాడారు. వరంగల్ జిల్లా సంగెం మండలం తీగ రాజుపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన తండ్రి, కుమార్తె కోసం గాలింపు కొనసాగుతోంది.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ తన భార్య కృష్ణవేణి, కుమార్తె చైత్ర సాయి, కుమారుడు ఆర్య వర్ధన్ సాయితో కలిసి హనుమకొండ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఆయ నకు గుండె నొప్పి వచ్చింది. దీంతో చికిత్స కోసం తిరిగి వరంగల్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుండె నొప్పి ఎక్కువై కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలో పడింది.
స్థానికుల సాయంతో కృష్ణవేణి బయటపడింది. కుమారుడు మృతి చెందగా కారుతో సహా ప్రవీణ్, చైత్ర సాయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. నీటిని అదుపులోకి తీసుకు వచ్చి కారును, ప్రవీణ్ ఆచూకీ కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.