— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi :ప్రజా దీవెన, నల్లగొండ: వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు .
బుధవారం ఆమె నల్గొండ సమీపంలోని ఆర్జాలబావి పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి సందర్శించారు.
ఎన్నికల సామాగ్రి పంపిణీ ఏర్పాటులను పర్యవేక్షించి పోలింగ్ కు నియమించిన సిబ్బందితో మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఎన్నికల నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని , ఈ నెల 27 న పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని, నల్గొండ జిల్లాతో పాటు తక్కిన 11 జిల్లాల ఎన్నికల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలలో 752 మంది సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్, సెక్టోరల్ ఆఫీసర్ చొప్పున నియమించామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులతో కూడిన బృందాలను పోలింగ్ కేంద్రాల్లో నియమించినట్లు ఆమె వెల్లడించారు.
సిబ్బంది అందరికీ రెండు విడతలుగా శిక్షణ ఇవ్వడం జరిగిందని ,పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని, వీటితోపాటు ,ఓఆర్ఎస్ పాకెట్లు, ప్రథమ చికిత్స, మందులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ప్రాధాన్యత ఓటు పై అవగాహన కల్పించామని తెలిపారు. ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒక దాన్ని చూయించి ఓటు వేయవచ్చని చెప్పారు. ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ కు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది పోటీలో ఉన్నారని చెప్పారు .నల్గొండ జిల్లాలో 37 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆమె వివరించారు .
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా 37 పోలింగ్ కేంద్రాలు ఉండగా ,అందులో 5 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని, ఈ కేంద్రాల పై మరింత దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. 13 రూటులను ఏర్పాటు చేయడం జరిగిందని ,ముఖ్యమైన పోలింగ్ లొకేషన్లో స్ట్రైకింగ్ ఫోర్స్ తో పాటు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు పెట్టడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యేలా ఏర్పాటు చేశామన్నారు.
రూట్ మొబైల్ ఆర్మ్డ్ పార్టీలను నియమించామని, ఇతర జిల్లాల పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని, అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద సెంట్రల్ పోలీస్ ఫోర్స్ తో పాటు, ఏఆర్ పోలీసులను ఏర్పాటు చేశామని, మొత్తం 618 మంది పోలీసుల సేవలను ఎమ్మెల్సీ ఎన్నికలలో వినియోగించుకోను న్నట్లు ఆయన వెల్లడించారు. నల్గొండ అదనపు కలెక్టర్ , వరంగల్ -ఖమ్మం- నల్గొం డ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏ ఆర్ ఓ జె. శ్రీనివాస్ , మిర్యాల గూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్చార్జి డిఆర్ఓ, నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి ,సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్, స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.