– వేలాదిగా తరలి వచ్చి స్వామి వారికి మొక్కులు
– విద్యుత్ దీప కాంతులతో ఆలయం ముస్తాబు
– పట్టు వస్త్రాలు సమర్పించిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
– నేటి రాత్రి స్వామివారి రథోత్సవం నిర్వహణ
Lakshmi Narasimha Kalyanam: ప్రజాదీవెన, యాదగిరి గుట్ట: యాదాద్రి జిల్లాలో స్వయంభువులు లక్ష్మీ నారసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. సాక్షాత్తు బ్రహ్మ నిర్ణయించిన ముహూర్తాన, వేదమంత్రోచ్ఛారణలతో.. మంగళవాయిద్యాలు, కర్పూర కాంతుల నడుమ వేడుక వైభవంగా జరిగింది.
భక్తుల ఓం నమో నారసింహాయ అంటూ నామస్మరణలతో ఆలయం ప్రాంగణం పరవశించి పోయింది. స్వర్ణాభరణాలతో అలంకరించిన ఉత్సవమూర్తులను వేదిక వద్ద కొలువుదీర్చిన దగ్గరనుంచి, ప్రతి ఘట్టాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కొండపైన ఉత్తర ముఖద్వారం రథోత్సవ మండపంపై కల్యాణ ఘట్టం జరిగింది.
మొదటగా ప్రధానాలయలో రాత్రి 8.25 గంటలకు గజ వాహన సేవపై స్వామివారు పెళ్లి కొడుకుగా ముస్తాబై మాఢ వీధుల్లో ఊరేగుతూ మండపానికి చేరుకున్నారు. విశ్వక్సేనుడికి తొలిపూజలతో ప్రారంభమై, స్వామికి యజ్ఞోపవీతధారణ జరిపి పాదప్రక్షాళన గావించారు. స్వామి, అమ్మవార్లను జీలకర్ర బెల్లంతో అలంకరించి మాంగళ్య పూజ తంతు నిర్వహించారు. బ్రహ్మముహూర్తంలో రాత్రి 10.48కి నారసింహుడు మహాలక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. అనంతరం భక్తులు దర్శించుకునేలా కల్యాణమూర్తులు కొలువుదీరారు.
విద్యుత్ దీప కాంతులతో స్వామివారి కొండను సంకల సౌకర్యాలతో ముస్తాబు చేశారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబసమేతంగా స్వామివారికి ప్రభుత్వం తరుఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంగీత కచేరి భక్తులను ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చారు.
గరుడ వాహన సేవలో విహరించారు. సోమవారం రాత్రి దివ్యవిమాన రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల తాకిడి, శాంతి భద్రతలకోసం డీసీపీ రాజేష్ చంద్ర నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.