HC Serious on HYDRA: హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం
కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం, విచారణకు గైర్హాజరు, అసంపూర్ణ అఫిడవిట్ అంశాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరును తెలంగాణ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

HC Serious on HYDRA: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (A V Ranganadh) వ్యవహారశైలిపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు విచారణకు హాజరు కాకపోవడాన్ని ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది.
భూ వివాదాలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. వివాదాస్పద ఆస్తుల వద్ద ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించకపోవడం, యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఆదేశాలను పూర్తిగా అమలు చేయకపోవడం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తింది.
విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాలేని పరిస్థితుల్లో కనీసం వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) ద్వారా అయినా వివరణ ఇవ్వాల్సిందని కోర్టు అభిప్రాయపడింది. అయితే ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోకపోవడం సరైన విధానం కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా గైర్హాజరుకు కారణాలు వివరిస్తూ అఫిడవిట్ కూడా దాఖలు చేయకపోవడాన్ని తీవ్ర నిర్లక్ష్యంగా పేర్కొంది.

కోర్టు ఉత్తర్వులు వెలువడిన తర్వాత కూడా సుమారు 20 రోజుల పాటు వివాదాస్పద బోర్డులు ఎందుకు తొలగించలేదో వివరించాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే విచారణకు హాజరు కాకపోవడానికి గల కారణాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో హైడ్రా తరఫు న్యాయవాది (Advocate) అఫిడవిట్ సమర్పించగా, కమిషనర్‌కు వ్యక్తిగత హాజరు నుంచి తాత్కాలిక మినహాయింపు లభించింది. అయితే సమర్పించిన అఫిడవిట్ పూర్తిస్థాయిలో లేదని, అందులో అవసరమైన వివరాలు లేకపోవడంతో కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
మరింత సమగ్రంగా, పూర్తి వివరాలతో కొత్త నివేదికను సమర్పించాలని హైడ్రాకు (Hydra) సూచించిన ధర్మాసనం, కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం అధికారుల వృత్తిపరమైన భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలని న్యాయవాదికి సూచించింది.
కోర్టు ఉత్తర్వుల అమలులో జాప్యం, విధివిధానాల పట్ల నిర్లక్ష్యం వంటి అంశాలను సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేస్తూ పూర్తి నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.



