MLC Election : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియడంతో కొందరు అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. ఓటర్లకు నగదు పంపిణీ మొదలుపెట్టారు. ఒక అభ్యర్థి పక్షాన గుర్తుతెలియని వ్యక్తులు నల్లగొండ జిల్లా ప్రాంత ఉపాధ్యాయులకు రూ 2000 ఫోన్ పే చేసి పూలు అని మెసేజ్ పంపారు. కొందరు ఓటర్లు వాటిని తిరస్కరించి వాపసు చేశారు. మరొక ప్రముఖ సంఘం అభ్యర్థి పక్షాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ 1000, ఖమ్మంలో రూ 2000, మహబూబబాద్ జిల్లాలో రూ 5000 పంపిణీ చేసినట్లు సమాచారం. అధికార పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకునే అభ్యర్థి పక్షాన కొన్ని పాఠశాలల్లో ఓటరుకు రూ 2000 చొప్పున పంపిణీ చేసినట్లు తెలిసింది. జాతీయ పార్టీ తరపున ఇంటింటికి రూ 2 నుండి 5 వేలు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు ఉపాధ్యాయులు నగదు తీసుకోకుండా తిరస్కరించారు. వారిని అభినందిస్తున్నాము.
పోటీలో ఉన్న అభ్యర్థులు తాము దిగజారి ఉపాధ్యాయుల విలువను దిగజార్చడం పట్ల టిఎస్ యుటిఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బక్క శ్రీనివాసా చారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు తాము చేసిన సేవలను వివరించి ఓట్లడగటం కాకుండా డబ్బు పంపిణీ చేసి గెలవాలనుకోవటాన్ని తీవ్రంగా టిఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల కమిషన్ డబ్బు పంపిణీని అడ్డుకోవాలని, పంపిణీ చేసే అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇలా డబ్బుతో ఓట్లను కొనే అభ్యర్థులకు మేధావి వర్గమైన ఉపాధ్యాయులు తగిన విధంగా బుద్ధి చెప్పాలని, ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడాలని నల్లగొండ జిల్లా కమిటీ కోరుతుంది.