Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda District Collector Tripathi : బయోచర్ పై రైతులకు అవగాహన కల్పించాలి

–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

–బయోచార్ ఫాక్టరీ ని సందర్శించిన కలెక్టర్

Nalgonda District Collector Tripathi : ప్రజాదీవెన నల్లగొండ : పంట వ్యర్థాలను వృధాగా పారేయకుండా దానితో జీవబోగ్గు (బయోచర్ ) ను ఉత్పత్తి చేసి తిరిగి పొలంలో వేసినట్లైతే కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా, కట్టంగూరు మండలం, చెరువు అన్నారంలో పంట వ్యర్థాలతో తయారు చేస్తున్న బయోచార్ సంస్థ తపోవనం బయోచార్ ఫాక్టరీ ని సందర్శించారు. బయోచార్ అనేది పంట వ్యర్ధాలైన సహజ వనరుల ద్వారా వచ్చేది. దీని ద్వారా నాణ్యమైన పంటలు పండించడం లో , మట్టి నాణ్యత పెంచడంలో ఎంతగానో ఉపయోగకరమైన ఒక పదార్థం. దీనిని జీవబోగ్గు అని కూడా అంటారు. ఆక్సిజన్ లేకుండా పత్తి కట్టెను, వరి గడ్డిని, అలాగే ఇతర పంట వ్యర్థాలను వేడి చేసి కట్టెలో సేంద్రియ కర్బనం నిలువ చేయడం ద్వారా బయోచార్ అనేది తయారవుతుంది. నల్గొండ ప్రాంతంలోని పొలాలలో ప్రస్తుతం కర్బనం 0.3 శాతం కంటే ఎక్కువగా లేదు. దీనిని ఒక శాథానికి పెంచడం వల్ల వ్యవసాయంలో నాణ్యమైన, అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. చాలామంది రైతులు ప్రత్యేకించి పత్తి రైతులు పంట కోసిన అనంతరం మిగిలిపోయిన పత్తి కట్టెలను అక్కడికక్కడే కాల్చి వేస్తున్నారు.దీనివల్ల వాయు కాలుష్యంతో పాటు, విలువైన సహజ వనరు వృధా అవుతుంది.

 

ఇలా వృధా కాకుండా బయోచర్ సంస్థ వాటిని సేకరించి ప్రాసెసింగ్ ద్వారా బయోచార్ (జీవ బొగ్గు)గా మార్చి తిరిగి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దీనిని మట్టిలో వేస్తే మట్టిలోని లోపాలను పూరించేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాక నీటి నిల్వలను మెరుగుపరచడం, సాగునీటి వినియోగం తగ్గించడం, మొక్కల వేరు వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి రోగాలను సైతం తగ్గిస్తుంది.అలాగే రసాయన ఎరువుల అవసరాన్ని కూడా తగ్గించి రైతులకు ఖర్చులను తగ్గిస్తుంది. ఒకవేళ పత్తికట్టెను కాల్చినట్లైతే వాయు కాలుష్యం పెరగడమే కాకుండా, దీనివల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్త కట్టంగూర్ మండలం చెరువు అన్నారం శివారులో తపోవనం బయోచార్ పేరున ఫ్యాక్టరీ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా రైతుల నుంచి పంట వ్యర్థాలను సేకరించి బయో చార్ గా మార్చి తిరిగి వారి పంట పొలాల్లో వేసుకునేందుకు ఉచితంగా ఈ సంస్థ అందజేస్తుంది. పర్యావరణాన్ని కాపాడుతున్నందుకుగాను కాలుష్య నివారణకు తోడ్పాటు చేస్తున్నందుకు ఈ సంస్థకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సహకారం ఉంటుంది.

ఈ విషయంపై అవగాహన కోసం జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా పరిశ్రమల అధికారి కోటేశ్వరరావు తోపాటు, కట్టంగూరు రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య లిమిటెడ్ స్థాపకులు, మాజీ శాసనసభ్యులు నంద్యాల నరసింహారెడ్డి లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వ్యవసాయ పంట పొలాల వ్యర్ధాల సేకరణ, తదితర వివరాలన్నింటిని సంస్థ ప్రతినిధుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై రైతులకు అవగాహన కలిగించినట్లయితే పంట వ్యర్ధాలను వృధా చేయకుండా బయోచార్ ద్వారా తిరిగి పంట పొలాలకు వినియోగించుకోవచ్చని, దీనిద్వారా కాలుష్య నివారణతో పాటు, భూమి నాణ్యత పెరిగి ఎక్కువ పంటలు, అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉన్నందున పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులకు సూచించారు. పంట పొలాల వ్యర్ధాల ద్వారా వచ్చే బయో చార్, పంట పొలాలపై వినియోగం, తదితర అంశాలను బయోచార్ తయారీకి వినియోగించే యంత్ర పరికరాలు అన్నింటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, కట్టంగూర్ తహసిల్దార్ మధు, వ్యవసాయ అధికారులు, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.