— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda District Collector Tripathi : ప్రజాదీవెన నల్లగొండ : సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాలు ఆదాయాన్ని సృష్టించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోలార్ యూనిట్లను జాగ్రత్తగా పర్యవేక్షణ చేయడం ద్వారా ఆదాయం పొందవచ్చన్నారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా, కట్టంగూరు మండలం, అయిటిపాములలో ఏర్పాటుచేసిన కట్టంగూరు స్వచ్ఛ శక్తి సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు.
ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక సాయం అందజేయడం ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన యూనిట్లను అయిటిపాముల స్వయం సహాయక మహిళా సంఘాలు గ్రామంలో నెలకొల్పడం జరిగింది. ఇందుకు సంబంధించి సుమారు 50 లక్షల రూపాయల చెక్కును రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్వయం సహాయక మహిళా సంఘాలకు అందజేయడం జరిగింది.దీని ద్వారా అయిటి పాముల గ్రామంలో సుమారు 50 గృహాలలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోగా,
వారు ఉత్పత్తి చేస్తున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వస్తున్న ఆదాయం, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వచ్ఛ శక్తి యూనిట్లో ఆన్లైన్ ద్వారా సోలార్ విద్యుత్ యూనిట్ల లోని బ్యాటరీల పరిస్థితి, ఉత్పత్తి తదితరాంశాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట కట్టంగూరు రైతు ఉత్పత్తుల సమాఖ్య అధ్యక్షులు నంద్యాల నరసింహారెడ్డి, స్వచ్ఛ శక్తి కేంద్రం ప్రతినిధి సుధాకర్, జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, తదితరులు ఉన్నారు. కాగా విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై పండ్లు, పూలు మొక్కల తక్కువ ధరలో రైతులకు, ప్రజలకు సరఫరా చేసేందుకు గాను నర్సరీ పెంచేందుకు స్థలాన్ని ఏర్పాటు ఇవ్వాలని నరసింహ రెడ్డి కోరగా అవసరమైన స్థలాన్ని చూడాలని ఆమె తహసిల్దార్ ను ఆదేశించారు.