–కౌలు రైతులను గుర్తించడంలో ప్రభుత్వం విఫలం.
–కౌలు రైతుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం:
పాశ్య పద్మ.
Pashya Padma : ప్రజా దీవేన, కోదాడ: గ్రామసభల్లో కౌలు రైతులను గుర్తించి భూమి ఉన్న రైతులతో పాటుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశ్య పద్మా అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లో కౌలు రైతుల సంఘం నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముందుగా కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ తో కలిసి రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో కౌలు రైతులను గుర్తించకపోవడంతో ప్రభుత్వ అందించిన బోనస్ డబ్బులు కౌలు రైతులకు దక్కలేదని ఇది చాలా బాధాకరమైన విషయం అన్నారు. కౌలు రైతులను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని వారి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమిస్తామన్నారు.
రైతు భరోసా, రుణమాఫీ, పంటల భీమా వంటి సంక్షేమ పథకాలను కౌలు రైతులను గుర్తించి వారికి అందజేయాలన్నారు. మార్చి 10న దేశవ్యాప్తంగా జరిగే ధర్నా కార్యక్రమానికి కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బొల్లు ప్రసాద్, జక్కుల రామారావు, బానోతు నెహ్రూ, బండమీది వెంకన్న, బెజవాడ వెంకటేశ్వర్లు, దొడ్డ వెంకటయ్య, కంబాల శ్రీనివాస్, పాపిరెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.