–ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగ
SC classification : ప్రజాదీవెన నల్లగొండ టౌన్ : ఎస్సీ వర్గీకరణ పోరాటం ప్రధానంగా విద్యా, ఉద్యోగాల్లో మాదిగలకు తగిన వాటా లభించాలనే లక్ష్యంతో జరుగుతుందని కనుక ఈ ఉద్యమాన్ని న్యాయమైన ముగింపు జరిగేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం తీసుకురావాలని ఎమ్మార్పీఎస్ నల్గొండ జిల్లా అద్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగ డిమాండ్ చేశారు. నల్గొండ పట్టణంలో కలెక్టర్ కార్యాలయం ముందు గత 5 రోజులుగా జరుగుతున్న రిలే నిరవధిక దీక్షలను ఉద్దేశించి ఇరిగి శ్రీశైలం మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలులో లేకపోవడం వల్ల గత డెబ్భై ఏళ్లుగా విద్యా, ఉద్యోగ రంగాల్లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణను అనుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో వర్గీకరణను అమలు చేయకపోతే మాదిగలకు ఘోరమైన అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నేడు తెలంగాణలో భర్తీ అవుతున్న ప్రతీ ఉద్యోగ నోటిఫికేషన్ కు ఎస్సీ వర్గీకరణను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఆమోదించి అమలులోకి తీసుకురావాలని అన్నారు.ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ నెల 17 న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించిన నేపథ్యంలో మాదిగ ప్రజలు అప్రమత్తంగా ఉండి పోరాటంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ దీక్షలో ఎంఎస్పి నల్గొండ నియోజక వర్గ ఇన్చార్జి బొజ్జ దేవయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి తరి ఏడుకొండలు మాదిగ, ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ మాదిగ, ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్షుడు మాసారం వెంకట్ మాదిగ, సీనియర్ నాయకుడు బొజ్జ రాబట్ మాదిగ, నాయకుడు బొజ్జ నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.