Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SLBC Tunnel Project: మూడేళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి..

— రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజా దీవెన: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, ఇందులో భాగంగానే కోటీశ్వరులు తినే సన్నబియాన్ని పేదలకు అందించడం జరుగుతున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కనగల్ మండలం జి.ఎడవెళ్లి గ్రామ చెరువుకు సుమారు కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న మరమ్మతు పనులను ప్రారంభించారు.

జిల్లా రైతాంగం ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, రిజర్వాయర్లను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా జి.యడవల్లి చెరువు తూము, ఇతర పనుల మరమ్మతుకు గాను కోటి రూపాయలను డీఎంఎఫ్టీ ద్వారా మంజూరు చేయడమే కాకుండా, బుధవారం నుండి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 4000 కోట్ల రూపాయల వ్యయంతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేపట్టడం జరిగిందని, అయితే అటువైపునుండి సొరంగం కూలిపోవడం వల్ల పనులు ఆగిపోయినప్పటికీ తిరిగి పనులను ప్రారంభించి మూడు ఏళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని చెప్పారు.

ఎడవల్లి గ్రామంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో 80 మందికి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగిందని చెప్పారు. దీనితోపాటు, 5 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు, 30 లక్షలతో డ్రైనేజీ మంజూరు చేశామని తెలిపారు. ఎడవల్లి చెరువు మరమ్మతు పనులను నాణ్యతగా చేపట్టాలని, నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కనగల్ ఆస్పత్రిలో గ్లూకోమా కంటి పరీక్షలకై అధునాతన యంత్రం ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా ఆస్పత్రి మాదిరిగా కనగల్ ఆసుపత్రిని తీర్చిదిద్దడం జరిగిందని వెల్లడించారు. కనగల్ మండల మహిళా సమాఖ్య సభ్యులకు అయిటిపాములలో లాగే సోలార్ విద్యుత్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏవైనా సమస్యలు ఉంటే మండల ప్రజలు తన దృష్టికి రావాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఉదయసముద్రం, బ్రాహ్మణవెల్లేముల తదితర ప్రాజెక్టుల ద్వారా నీరు వృథా కాకుండా ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్‌తో పాటు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి నీటి సద్వినియోగానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎడవల్లి చెరువు తూము గండి వల్ల నీరు వృథా అవుతున్నదని తెలుసుకొని ఆ చెరువు పనుల మరమ్మతుకు మంత్రి ఆదేశాలతో నిధులు మంజూరు చేయడం జరిగిందని, వచ్చే వానకాలం నాటికి మరమ్మతులను పూర్తి చేసి రైతులకు చెరువు నుంచి పూర్తి స్థాయిలో నీరు పొందే విధంగా చర్యలు తీసుకుంటామని, అధికారులు నిర్దేశించిన సమయంలో నాణ్యతతో పనులు పూర్తి చేయాలన్నారు. 30 లక్షలతో ఎడవల్లి గ్రామానికి డ్రైనేజీని మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

గ్రామ పెద్ద, నాయకులు అనంతరెడ్డి మాట్లాడుతూ ఎడవల్లి చెరువు గండిని పూడ్చేందుకు అడిగిన వెంటనే కోటి రూపాయలు మంజూరు చేయడం పట్ల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దొరేపల్లి వరకు నిర్మిస్తున్న రోడ్డులో భాగంగా మిగిలిపోయిన పనులను, అలాగే లక్ష్మీదేవిగూడెం వరకు నిర్మించే రోడ్డు బ్యాలెన్స్ పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇంచార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెహ్రూ, నల్గొండ ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, తహసిల్దార్ పద్మ, ఇంజినీరింగ్ అధికారులు, తదితరులు ఉన్నారు.