–బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
–బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
— నిందితుడు సీతారాములు అరెస్ట్
— సిబ్బందిని అభినందించిన ఎస్పీ శరత్ చంద్ర పవర్
SP Sarath Chandra Power :ప్రజాదీవెన నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. కేసును నల్లగొండ టూ టౌన్ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశానుసారం టూ టౌన్ ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు ఆరు టీంలుగా వీడిపోయి నిందితుడి కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నార్కట్పల్లి మండలం మాండ్రా గ్రామంలో కిడ్నాపర్ సీతారాములును గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలుడిని క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో గత మూడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నల్లగొండ పట్టణంలోని లైన్ వాడకు చెందిన మహమ్మద్ హైమద్, షమీమ్ మున్నీస దంపతులకు ఐదు సంవత్సరాల అమ్మాయి, మూడు సంవత్సరాల అబ్బాయి ఉన్నారు.
గత 4వ తేదీన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఐస్ క్రీమ్ బండి వద్ద బాలుడు రెహమాన్ ఆడుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో అటుగా వచ్చి నార్కట్పల్లి మండలం మాండ్రాకు చెందిన రాపోలు సీతారాములు
మాయ మాటలు చెప్పి బాలుడిని ఎత్తుకెళ్లి పోయాడు. అయితే, కొద్దిసేపటి తరువాత బాలుడు కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు హుటాహుటిన నల్లగొండ పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి, టూ టౌన్ సిఐ రాఘవరావు పర్యవేక్షణలో టూ టౌన్ ఎస్ఐ నాగరాజు కేసును తనదైన శైలి లో ఛేదించారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో బాలుడు ఆడుకుంటుండగా.. సీతారాములు ఎత్తుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమై స్వల్ప వ్యవధిలోనే కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకుని బాలుడిని కాపాడారు. ఈ క్రమంలో నల్లగొండ పట్టణ ప్రజలు, అబ్దుల్ రెహమాన్ తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
నిందితుడు సీతారాములు చిన్నమ్మ కూతురు అయిన ముద్దముల అరుణ కు ముగ్గురు కూతుర్లు వుండి మగ సంతానము లేదు. ఆమెకు మగ పిల్లవాడు కావాలని సీతారాములుకు చెప్పగా నిందితుడు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలలో బాలుడు గత కొద్ది రోజుల నుండి ఆడుకోవడము గమనించి అతన్ని కిడ్నాప్ చేశాడు. మగ పిల్లలు లేని అతని చెల్లెలు అరుణ కు బాలుడిని అప్పగించారు. కాగా కేసును 48 గంటల్లో చేదించిన పోలీసు సిబ్బంధిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అబినంధించినారు.