–స్లాట్ బుకింగ్ పాట్లకు ఇక చెక్
–దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు
–ఇంటి నుంచే బుక్ చేసుకునే అవకాశం
–జాబితాలో కొత్తగా మరికొన్ని రుగ్మతలు
–మొత్తం 21 రకాల వైకల్యాలకు సర్టిఫికెట్లు
–తీరనున్న బాధితుల కష్టాలు
UDID cards : ప్రజాదీవెన నల్గొండ : దివ్యాం గులకు ‘సదరం’ కష్టాలు తీరనున్నాయి. సర్టిఫికెట్ల జారీ, రెన్యూవల్స్ ప్రక్రి యను ప్రభుత్వం సులభతరం చేసింది. శిబిరాల కోసం ఇప్పటి వరకు మీసేవ కేంద్రాల నుంచే దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. మారుమూల ప్రాంతాల్లోని దివ్యాంగులు అనేక వ్యయ ప్రయాసల కోర్చి సమీప పట్టణంలోని మీసేవ కేంద్రానికి చేరుకుని, స్లాట్ బుక్ చేసుకుందామని భావిస్తే.. తీరా స్లాట్లు ఖాళీ లేకుండా పోయేవి. ఇలా నెలల తరబడి మీ సేవ కేంద్రాల చుట్టూ బాధితులు తిరగాల్సి వచ్చేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు దివ్యాంగుల జాబితాలో మరికొన్ని రుగ్మతలను చేర్చింది. ఇప్పటి వరకు ఏడు రకాల బాధితులకు మాత్రమే సదరం క్యాంపులకు అవ కాశం కల్పించింది. తాజాగా మరికొన్ని రుగ్మతలను ఈ జాబితాలో చేర్చింది.
గతంలో ఏడు.. ప్రస్తుతం 21 రకాలు
గతంలో ఏడు రకాల వికలత్వ రుగ్మతలకు మాత్రమే సదరం సర్టిఫికెట్లు ఇచ్చేవారు. తాజాగా మరికొన్ని జబ్బులను ఈ జాబితాలో చేర్చింది. అంధత్వంతో బాధపడే వారితో పాటు వినికిడి లోపం ఉన్నవారు, పుట్టుకతోనే ఆవయవలోపంతో జన్మించిన వారు, రోడ్డు, ఇతర ప్రమాదాల్లో కాళ్లు, చేతులు, ఇతర అవయవాలు కోల్పోయిన వారు, ఆటిజం, యాసిడ్ దాడిలో గాయపడిన వారు, తలసీమియా బాధితులు, పక్షవాతంతో బాధపడు తున్నవారు, మానసిక రుగ్మతులు, మాటలు రాని వారు, పార్కిన్ సన్ తో బాధపడుతున్నవారు, కుష్టు వ్యాధిగ్రస్తులు, కండరాల సమస్యతో బాధపడు తున్న వారు, హీమోఫిలియా బాధితులు.. ఇలా మొత్తం 21 రకాల వికలాంగత్వంతో బాధపడుతున్న వారికి అవకాశం క కల్పించింది. వీరందరికి పెన్షన్ సహా ఆర్టీసీ, రైల్వే ప్రయాణాల్లో రాయితీ సౌకర్యం కల్పించనుంది.
నల్లగొండ జిల్లాలో 205579 మంది పింఛన్దారులు…
నల్గొండ జిల్లాలో ప్రస్తుతం మొత్తం 205579 మంది పింఛన్దారులు ఉన్నారు. అందులో అత్యధికంగా వితంతు పింఛన్లు 79895 మంది ఉండగా వృద్ధులు 73178 మంది ఉండి రెండవ స్థానంలో నిలిచారు. వికలాంగుల పెన్షన్లు 30671, చేనేత 2999, గీతా కార్మికులు 7863, ఒంటరి మహిళలు 7640, ఆర్ట్ పెన్షన్లు 2063, ఫైలేరియా 1077, డయాలసిస్ 193 పింఛన్ లు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 205579 మంది పించన్దారుల కోసం ప్రభుత్వం ప్రతినెల సుమారు ఆసరా కింద 52. 84 కోట్ల రూపాయలను చెల్లిస్తుంది.
మూడు రకాల కార్డులు…
పెన్షన్ దారులంతా వివిధ రకాల వికలాంగత్వంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపానికి తోడు జన్యుపరమైన కారణాలతో అనేక మంది పుట్టుకతోనే అవయవలోపంతో బాధపడుతున్నారు. వీరితో పాటు అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడి, కాళ్లు, చేతులు కోల్పోతున్నారు. మరికొంత మంది దీర్ఘకాలిక జబ్బుల బారిన పడుతున్నారు. వీరందరికీ సదరం సర్టిఫికెట్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుపు, పసుపు, నీలం రంగు ఇలా మూడు రకాల కార్డులను జారీచేయున్నారు. వికలాంగత్వం 40 శాతం ఉంటే తెలుపు కార్డు, 40 శాతం నుండి 79 శాతం వరకు ఉంటే పసుపు రంగు కార్డు, 80 శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం ఉంటే నీలం రంగు కార్డును అందజేస్తారు.
బాధితులకు ఉపశమనం…
ఇప్పటి వరకు సదరం క్యాంపులకు మీసేవ కేంద్రాల్లో మాత్రమే స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ సిస్టంను సులభతరం చేసింది. వీరికీ యూనిక్ డిజిబెలిటీ ఐడీకార్డు (యూడీఐడీ)ను జారీ చేయడం ద్వారా ఇంట్లో నుంచే నేరుగా స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆయా బాధితులందరికీ ఉపశమనం కలగనుంది. పాత కార్డుల రెన్యూవల్స్, కొత్తకార్డుల జారీ ప్రక్రియ పూర్తిగా ఈ యూడీఐడీ ద్వారానే నిర్వహించనుంది.