Ḍr. Samudrala upendar : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మంగళవారం తెలంగాణ ప్రభుత్వ కళాశాలల అధ్యాపక సంఘ క్యాలండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం మరింత విద్యా ప్రగతి సాధించాలని అందుకు అధ్యాపకులు ఇతోధికంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చి దిద్దడానికి శ్రమించాలని కోరారు. కరోనా తర్వాత విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయనే విమర్శలు వస్తున్నాయని వాటిని అధిగమించాలని సూచించారు. సంఘ బాధ్యులు అధ్యాపకుల సంక్షేమం కోసం శక్తి వంచన లేకుండా పని చేయాలని అన్నారు.
అధ్యాపకులు హక్కులతో పాటు బాధ్యతల్ని కూడా గుర్తించాలని అన్నారు. వేతన సవరణ కమీషన్ వేయించడంతో పాటు మరిన్ని హక్కులను ప్రభుత్వం ద్వారా సాధించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా టిజిసిటిఎ అసోసియేషన్ అధ్యక్షులు డా. ఎం. అనిల్ అబ్రహం, కార్యదర్శి డా. బొజ్జ అనిల్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్, పరీక్షల నియంత్రణాధికారి బి. నాగరాజు, తెలుగు శాఖాధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, అధ్యాపకులు డా. శ్రీనివాస్ రెడ్డి, డా. భట్టు కిరీటం, డా. మునిస్వామి, డా. ప్రసన్న కుమార్, మల్లేశం, సుధాకర్, ఒప్పంద అధ్యాపకులు, అతిథి అధ్యాపకులు పాల్గొన్నారు.