— మున్సిపాలిటీలో ప్రత్యేక ప్రాణాలిక
— ఒక చర్య.. ఒక మార్పు నినాదం తో 50 అంశాల ప్రత్యేక కార్యక్రమాలు
— నల్లగొండ జిల్లాలో 8 మున్సిపాలిటీలు
–ఈనెల 2 నుండి సెప్టెంబర్ 10 వరకు నిర్వహణ
–కార్యాచరణ ప్రణాళిక ర్యాలీ ప్రారంభించి ప్రతిజ్ఞలో పాల్గొన్న కలెక్టర్ త్రిపాఠి
Cleanliness Drive : ప్రజాదీవెన నల్గొండ బ్యూరో : పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం.. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే సామర్థ్యం కల్పించే దిశగా పురపాలక శాఖ అన్ని నగరాలు, పట్టణాల్లో వంద రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ప్రతి రోజు ‘ఒక చర్య.. ఒక మార్పు’ అనే నినాదంతో ప్రజా భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఈ నెల 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు 50 అంశాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నల్లగొండ జిల్లాలో 8 మున్సిపాలిటీలో ఉండగా అక్కడ రోజువారీగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా సోమవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం అనంతరం నల్లగొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో రానున్న 100 రోజులలో చేపట్టనున్న కార్యక్రమాలపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై ఏర్పాటు చేసిన ర్యాలీని మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించి, ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.
— ప్రారంభమైన కార్యాచరణ…
సిబ్బందికి, వాలంటీర్లకు శిక్షణ, ర్యాలీలు, ప్రతిజ్ఞ నిర్వహణ, ప్రచార వ్యూహాన్ని ప్రజల్లోకి తీసు కెళ్లడం. అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, నోడల్ అధికారుల నియామకం.
–పూడికతీత పనులు..
వర్షం నీరు సక్రమంగా ప్రవహించేలా రహదారులపై చెత్తా చెదారం తొలగింపు. వరద కాలువల్లోని పూడికను తొలగించడం. పారిశుద్ధ్య కార్మికులు, యంత్రాలు, పరికరాలు సమకూర్చుకోవడం.
–దోమల నియంత్రణ..
డెంగీ, మలేరియా వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం. నిల్వ నీటిలో దోమల లార్వా, పెరగకుండా ఆయిల్ బాల్స్, గంబూసియా చేప పిల్లలను వదలడం.
–సులభ్ కాంప్లెక్స్ ల తనిఖీ..
నగరాలు, పట్టణాల్లోని సులభ్ కాంప్లెక్స్ తనిఖీ శుభ్రతపై పర్యవేక్షణ. నిర్వహణ, వినియోగంపై అభిప్రాయాల సేకరణ.
–కంపోస్టు ఎరువు తయారీ..
తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారీపై అవగాహన కల్పించడం. చెత్తను వేరు చేసే డబ్బాల పంపిణీ. డంపింగ్ యార్డుకు చెత్త తరలించేలా చూడటం. పాఠశాలలో కంపోస్టు యూనిట్ ఏర్పాటు.
–బర్తన్ బ్యాంకులు..
ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ సామగ్రి వినియోగం తగ్గించేందుకు బర్తన్(స్టీల్ పాత్రల) బ్యాంకుల ఏర్పాటు. నల్లగొండ జిల్లాలో ఉన్న ఎనిమిది మున్సిపాలిటీలలో స్వశక్తి సంఘాల సభ్యులు నిర్వహిస్తున్న ఈ బ్యాంకుల ద్వారా ప్రతి వేడుకలో ఉక్కు, గాజు, స్టీలు పాత్రలు వాడేలా ప్రచారం చేయడం.
–వ్యర్ధాల వేరుపై ప్రచారం..
రద్దీ ప్రాంతాల్లో, నివాస గృహాల్లో పరిసరాల పరిశుభ్రత పై మైక్ ద్వారా ప్రచారం. వీధుల్లో పిచ్చి మొక్కల తొలగింపు తడి, పొడి చెత్తను వేరు చేసేలా అవగాహన కల్పించడం. పరిసరాల శుభ్రతపై ప్రతి ఇంటికీ స్టిక్కర్లు అతికించడం. వేస్ట్ ఆడిట్ నిర్వహించడం.
–ఇంటింటికీ అవగాహన..
చెత్తను వేరు చేయడం, పరిశుభ్రత, ఘన వ్యర్ధాల నిర్వహణపై ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడం. స్వశక్తి సంఘాలు, ఎన్జివోలు, ప్రజాప్రతినిధులు, వార్డు అధికారులు, పారిశుద్ధ్య కార్మికులను భాగస్వాములను చేయడం. బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడం.
–గోడ చిత్రాలు..
పరిశుభ్రత, చెత్త నిర్వహణ, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రతపై గోడ చిత్రాలు రాయించడం.
అభివృద్ధి పనులకు సంబంధించిన బొమ్మలను ఆకట్టుకునేలా గీయించడం. స్వచ్ఛత పై క్విజ్, పెయింటింగ్, రచన, రంగోలి కార్యక్రమాల నిర్వహణ. ఇలా వివిధ రకాలుగా వంద రోజులపాటు కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది.